Swati Maliwal Assault Case: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు బిభవ్ కుమార్‌కు హజారీ కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని స్వాతీ మాలీవాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అయనను శనివారమే అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారు. బిభవ్ కుమార్‌ను ఏడు రోజుల తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మే 23 వరకు పోలీసు కస్టడీ విధించింది కోర్టు. ముందస్తు బెయిల్ కోసం బిభవ్ కుమార్ పిటిషన్ దాఖలు చేయగా, దానిని కోర్టు తిరస్కరించింది.
అయితే కోర్టుకు ఇది చాలా తీవ్రమైన కేసు అని, ఒక పార్లమెంట్ సభ్యురాలు, ప్రజాప్రతినిధిపై దాడి జరిగిందని దిల్లీ పోలీసులు తెలిపారు. అలాగే సీఎం నివాసం నుంచి సీసీటీవీ పుటేజీని కూడా లభించిందని చెప్పారు. బిభవ్ కుమార్ అధికార హోదాలో పనిచేశారని, ప్రభావవంతమైన వ్యక్తి అని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని న్యాయస్థానానికి తెలిపారు. బిభవ్ తన మొబైల్ పాస్వర్డ్ అడిగినా చెప్పడం లేదని, ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఫోన్‌ను ఫార్మాట్ చేశారని ఆరోపించారు. అయితే తన ఫోన్ హంగ్ కావడం వల్లే ఫార్మాట్ చేయాల్సి వచ్చినట్టు బిభవ్ కుమార్ తెలిపారని పేర్కొన్నారు. ఈ కేసులో బిభవ్ మొబైల్ కీలక సాక్ష్యమని, దానిని అన్ లాక్ చేయాల్సి ఉంటుందని, అందుకే కస్టడీకి అప్పగించాలని కోర్టుకు దిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.