Places To Visit Near Hyderabad : హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న కొన్ని పర్యాటక ప్రదేశాల్లో మొదటిది మెదక్ జిల్లాలోని ఉన్న పోచారం అభయారణ్యం. ప్రకృతి, జంతు ప్రేమికులకు గొప్ప మధుర జ్ఞాపకాలను మిగుల్చుతుందీ ప్రాంతం. దాదాపు 130 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతంలో.. ఎన్నో అరుదైన పక్షులు ఉన్నాయి. అలాగే చిరుతపులి, జింకలు, నక్కలతో పాటు ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే మీరు పోచారం సరస్సు, జింకల పార్క్ తప్పకుండా చూడాలి. అలాగే ఫొటోగ్రఫీ కూడా చేయొచ్చు.
- పోచారం అభయారణ్యం హైదరాబాద్ నుంచి దూరం 113 కి.మీ
హైదరాబాద్లో బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే.. ఎంచక్కా ఈ వీకెండ్కు చెక్కేయండి
నాగార్జున సాగర్ :
హైదరాబాద్ సమీపంలో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో నాగార్జున సాగర్ ఒకటి. ఇది నల్గొండ జిల్లాలో ఉంది. ఇక్కడికి వెళ్తే మీరు కృష్ణా నదిపై నిర్మించిన అతిపెద్ద రాతి నిర్మాణమైన నాగార్జున సాగర్ ఆనకట్టను చూడొచ్చు. తర్వాత బోట్ ఎక్కి నది మధ్యలో ఉన్న నాగార్జున కొండకు వెళ్లొచ్చు. ఇక్కడ బౌద్ధ మహాయాన చక్రవర్తి నాగార్జున స్థాపించిన బౌద్ధ విహారంతోపాటు.. ప్లానిటోరియం, ఆర్ట్ గ్యాలరీ చూడొచ్చు. అలాగే ఆనాటి సంస్కృతిక వైభవం, కళాఖండాల అద్భుతాలను చూడొచ్చు.
- నాగార్జున సాగర్ హైదరాబాద్ నుంచి దూరం 155 కి.మీ
అనంతగిరి హిల్స్ :
హైదరాబాద్‌కు సమీపంలో ఉండే హిల్ స్టేషన్లలో అనంతగిరి కొండలు ఒకటి. ఈ పర్యాటక ప్రదేశం వికారాబాద్ జిల్లాలో ఉంటుంది. తెలంగాణలోని అతిపెద్ద దట్టమైన అటవీ ప్రాంతమైన ఈ అనంతగిరి హిల్స్.. దాదాపు 3,763 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దీనిని 'తెలంగాణ ఊటీ'గా పిలుస్తారు. ఎత్తయిన కొండలు, పచ్చటి చెట్లు, ఇరుకైన లోయలు, స్వచ్ఛమైన గాలి, మంచినీటి సరస్సులు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు! ఇక్కడికి వెళ్తే అడవి మధ్యలో ఉన్న 1300 సంవత్సరాల చరిత్ర గల అనంత పద్మ నాభస్వామి ఆలయం, నాగసముద్రం సరస్సు, భవనాసి సరస్సు తప్పకుండా చూడాలి. ఇంకా ట్రెక్కింగ్, బోటింగ్ అక్టివిటీస్ కూడా చేయొచ్చు!
- అనంతగిరి హిల్స్ హైదరాబాద్ నుంచి దూరం 75 కి.మీ