తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Aug 20, 2024, 6:04 PM IST

ETV Bharat / bharat

లండన్​లో ఉన్న భార్యతో పిల్లల్ని కనేందుకు పెరోల్- హత్య​ కేసు నిందితుడి విజ్ఞప్తికి కోర్టు ఓకే - Murder Accused Parole for Kids

Murder Accused Parole For Kids : తనకు సంతానం కావాలని, లండన్​లో ఉన్న తన భార్యను కలిసేందుకు పెరోల్​పై విడుదల చేయాలని జైలులో ఉన్న ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అందుకు అంగీకరించిన కోర్టు నాలుగు నెలల పెరోల్​కు అనుమతిచ్చింది. ఇంతకీ ఏమి జరిగిందంటే?

Murder Accused Parole For Kids
Murder Accused Parole For Kids (Getty Images, ANI)

Murder Accused Parole for Kids : తండ్రి కావాలనే కోరికను తీర్చేందుకు ఓ హత్య కేసులో నిందితుడిగా ఓ వ్యక్తికి పెరోల్​ మంజూరు చేసింది దిల్లీలోని సాకేత్ కోర్టు. విదేశాల్లో ఉన్న తన భార్యతో కలిసి ఉండేందుకు ఆ వ్యక్తికి నాలుగు నెలల పాటు పెరోల్​కు అనుమతిచ్చింది. గత 11 ఏళ్లుగా జైలులో ఉన్న రిధమ్ గిరోత్రాను రూ.5 లక్షలతో ష్యూరిటీ బాండ్​తో విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.

ఇదీ జరిగింది
2013 సెప్టెంబర్ 13న రిధమ్​ గిరోత్రా, అతడి నలుగురు స్నేహితులు కలిసి మద్యం సేవించేందుకు దిల్లీలోని కాల్​కాజీలోని ప్రణీల్​ షా అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు. అందరూ మద్యం సేవించి తర్వాత వారిలోని అన్​మోల్ సర్నా అనే వ్యక్తి, ప్రణీల్​ ఇంట్లోని వస్తువులను బయటకు విసిరేయడం ప్రారంభించాడు. దీంతో ప్రణీల్​కు, మిగతా వారి మధ్య గొడవ జరిగింది. ఈ విషయాన్ని గమనించిన పక్కన వాళ్లు ఇద్దరు వచ్చి గొడవను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కానీ ప్రణీల్​ వారిని కూడా కొట్టి పరుగెత్తాడు. ఆ తర్వాత ప్రణీల్​ అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిని పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. అప్పటి నుంచి రిధమ్​ జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు.

భార్య ఇండియాకు రాలేదు
రిధమ్​కు 2022లో లండన్​లోని ఓ కంపెనీలో పని చేస్తున్న అక్షితా అహూజాతో వివాహం జరిగింది. రిధమ్​ భార్యకు 2023లోనే యూకే పౌరసత్వం లభించింది. తనకు సంతానం కావాలని, రెండేళ్లుగా లండన్​లో ఉంటున్న తన భార్యను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా దిల్లీ పోలీసులు పెరోల్​ మంజూరు చేసేందుకు వ్యతిరేకించారు. నిందితుడిపై మోపిన అభియోగాలు చాలా తీవ్రమైనవని, లండన్ వెళ్లేందుకు అనుమతిస్తే భారత్​కు తిరిగి రాడని, తప్పించుకునేందుకే ఈ ప్లాన్​ అని అన్నారు. అయితే, 2019లో కూడా ఫిలిప్పీన్స్​లో ఉన్న తన తల్లిదండ్రులను కలిసేందుకు అనుమతిచ్చారని, ఆ సమయంలో ఎలాంటి నిబంధనలను ఉల్లఘించలేదని రిధమ్​ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. రిధమ్​ భార్య ప్రస్తుతం ఇండియాకు రాలేదని, అతడే లండన్​కు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఇంటి అడ్రసు కోర్టు తెలియజేయాలి
దీనిపై విచారణ చేపట్టిన సాకేత్ కోర్టు, నిందితుడి ప్రవర్తన ఆధారంగా తన భార్య వద్దకు వెళ్లేందుకు పెరోల్​ను జారీ చేసింది. ఇ-వీసా, ఇ-టికెట్ కాపీని కోర్టులో సమర్పించాలని, లండన్‌లో నివాసం ఉంటున్న చిరునామా, ఫోన్ నంబర్‌ను కోర్టును తెలియజేయాలని నిందితుడికి ఆదేశించింది. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన పాస్‌పోర్టును కోర్టుకు సమర్పించాలని పేర్కొంది.

పెళ్లి కోసం 4 గంటల పెరోల్​.. వివాహం చేసుకుని మళ్లీ జైలుకెళ్లిన వరుడు..

గర్భం దాల్చాలని ఖైదీ భార్య కోరిక.. భర్తకు 15 రోజులు పెరోల్ ఇచ్చిన కోర్టు

ABOUT THE AUTHOR

...view details