Maneka Gandhi On Varun Lok Sabha Seat : బీజేపీ అధిష్ఠానం తన కుమారుడు వరుణ్ గాంధీకి ఫీలీభీత్ లోక్‌సభ టికెట్ ఇవ్వకపోవడానికి, ఆయన పార్టీపై విమర్శలు చేయడమే కారణమై ఉండొచ్చని మేనకా గాంధీ అన్నారు. అయితే టికెట్ దక్కనప్పటికీ వరుణ్ రాజకీయాల్లో రాణించగలరనీ ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. సుల్తాన్‌పూర్‌లో తన కోసం ప్రచారం చేయడానికి వరుణ్ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు మేనకా గాంధీ చెప్పారు. అయితే ఆ విషయంపై నిర్ణయం పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రభుత్వాన్ని విమర్శించేలా కొన్ని విషయాలపై వరుణ్ చేసిన ప్రసంగాల వల్లే టిక్కెట్ దక్కలేదా అని అడిగినప్పుడు తాను మరొక కారణం గురించి ఆలోచించలేనని మేనకా అన్నారు. 'వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ నిరాకరించినందుకు ఒక తల్లిగా నాకు సంతోషమైతే కలగదు కదా. ఈసారి కూడా ఫీలీభీత్ నుంచి వరుణే పోటీ చేస్తే బాగుండేది. కానీ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని మనం మార్చలేం' అని మేనకాగాంధీ వ్యాఖ్యానించారు.
వరుణ్‌గాంధీ సుల్తాన్‌పూర్ స్థానానికి మారుతారా?
'భవిష్యత్తులో వరుణ్ గాంధీ సుల్తాన్‌పూర్ స్థానానికి మారుతారా?'' అని మేనకాగాంధీని ప్రశ్నించగా, అందుకు ప్రస్తుతానికి ఫీలీభీత్తో పాటు యావత్ భారతదేశం అతడి కర్మభూమి, ఆయన్ని అక్కడే పనిచేయనివ్వండి అని పేర్కొన్నారు. సుల్తాన్‌పూర్ లోక్‌సభ స్థానంలో తాను జాతీయ అంశాల కంటే స్థానిక సమస్యల గురించే ఎక్కువగా మాట్లాడతానని, ఎందుకంటే ప్రజలకు వాటిపైనే ఆసక్తి ఎక్కువ అని తెలిపారు.
నేను తప్పకుండా గెలిస్తాను
గత ఎన్నికల్లో మీరు కేవలం 14వేల ఓట్ల తేడాతో గెలిచారు, ఈ సారి పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించగా, మరింత మెరుగైన విజయాన్ని సాధిస్తాని మేనకాగాంధీ చెప్పారు. 'ఈ నియోజకవర్గంలో నేను స్థిరపడ్డాను. ఈసారి నేను మరింత మెరుగ్గా రాణిస్తాను. ఈ ప్రాంతానికి నా భర్త సంజయ్ గాంధీ ఎంతో సేవ చేశారు. దాన్ని ఇక్కడి ప్రజలు ఎప్పటికి మరిచిపోరు. నేను తప్పక గెలుస్తాను. ఈసారి ఎంత మెజారిటీ వస్తుందో ఇప్పుడే చెప్పలేను' అని తెలిపారు.
రామమందిరం ఎఫెక్ట్ ఎంత ?
ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో రామమందిరానికి అధిక ప్రాధాన్యం ఉంది కదా మీ నియోజకవర్గంలో ప్రభావం ఉంటుందా అని ప్రశ్నించారు. 'అయోధ్య పక్కనే ఉన్నప్పటికీ సుల్తాన్‌పూర్‌లో ఆ ప్రభావం పెద్దగా లేదు. దానికి ఇక్కడి తక్కువ ప్రాధాన్యం ఉంది' అని బదులిచ్చారు.