Kolkata Doctor Case Update Today :బంగాల్ జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు కోల్‌కతా ప్రెసిడెన్సీ జైలులో లై డిటెక్షన్ టెస్ట్ జరిగింది. మరో ఇద్దరికి కోల్‌కతాలోని సీబీఐ ఆఫీసులో ఆదివారం ఈ పరీక్షను నిర్వహించినట్లు విచారణ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో సహా నలుగురికి శనివారం సీబీఐ ఆఫీస్‌లో సత్యనిరూపణ పరీక్ష పూర్తయింది. వారిలో ఇంటర్న్‌లు, డాక్టర్లతో సహా ప్రధాన నిందితుడి స్నేహితుడు ఒకడు ఉన్నారు.
అయితే శనివారం లై డిటెక్షన్ పరీక్ష జరగాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడటం వల్ల ఆదివారం నిర్వహించారు. దిల్లీ నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన పాలీగ్రాఫ్ నిపుణుల బృందం కోల్‌కతాకు వచ్చి పరీక్షలను నిర్వహించారు. మొత్తం ఏడుగురిపై పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఈ టెస్ట్‌ను ఏడుగురిపై విడతల వారీగా నిర్వహిస్తామని పరీక్షలు పూర్తయ్యేందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని సీబీఐ తెలిపింది. సీబీఐ విచారణలో నేరాన్ని చేసినట్లు ఒప్పుకున్న నిందితుడు కోర్టులో జడ్జి ఎదుట హాజరుపర్చినప్పుడు మాత్రం తనను కుట్రపూరితంగా కేసులో ఇరికించారని వాపోయాడు. ఈ నేపథ్యంలో లైడిటెక్షన్ పరీక్షలో నిందితుడు ఏం చెప్పి ఉంటాడన్నదానిపై ఆసక్తి నెలకొంది.
డాక్టర్ సందీప్ ఘోష్ ఇంటిపై సీబీఐ దాడులు
మరోవైపు, డాక్టర్ సందీప్ ఘోష్ ఆస్తులపై ఆదివారం కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు మొదలుపెట్టింది. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సీబీఐ బృందాలు తనిఖీలు చేశాయి. ఆర్జీ కర్ మెడికల్ కళాశాలలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టారు. ఇప్పటికే అవకతవకలకు పాల్పడినట్లు సీబీఐ ఘోష్‌పై కేసులు నమోదు చేసింది.