తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్‌ ఎగ్జిట్ పోల్స్‌- హంగ్‌ అసెంబ్లీకి ఛాన్స్! - Jammu Kashmir Exit Poll 2024 - JAMMU KASHMIR EXIT POLL 2024

Jammu Kashmir Exit Poll 2024 : జమ్ముకశ్మీర్‌ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువరించాయి.

Jammu Kashmir Exit Poll 2024
Jammu Kashmir Exit Poll 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2024, 7:16 PM IST

Updated : Oct 5, 2024, 8:45 PM IST

Jammu Kashmir Exit Poll 2024 :పదేళ్ల తర్వాత జరిగిన జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ సీట్లు రాబోవని సర్వే సంస్థలు అంచనా కట్టాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్- కాంగ్రెస్‌ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లకు అటూ ఇటుగా సీట్లు వస్తాయని అంచనా వేశాయి. బీజేపీకు కనిష్ఠంగా 20 గరిష్ఠంగా 32 స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి. మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ సింగిల్‌ డిజిట్‌కు పరిమితం కానుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి.

జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత నిర్వహించిన ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొత్తం 90 స్థానాలకు గానూ మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాలు అవసరం. 2014లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ సరైన మెజారిటీ రాకపోవడంతో భాజపా, పీడీపీ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈ సారి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీ పొత్తుతో బరిలోకి దిగాయి.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

  • జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ - కాంగ్రెస్ కూటమి 46-50 స్థానాలు సాధించొచ్చని 'పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌' సంస్థ అంచనా వేసింది. భాజపా- 23-27 స్థానాలు; పీడీపీ 7-11 స్థానాలు; ఏఐపీ 0-1, ఇతరులు 4-5 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు తెలిపింది. కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్‌ 33-35, కాంగ్రెస్ 13-15 స్థానాలు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యం ఇస్తారని సర్వేలో కోరగా మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాకు సుమారు 28 శాతం మంది మద్దతిచ్చారని సర్వే సంస్థ వెల్లడించింది. మిగిలిన వారంతా ఆయనకు చాలా దూరంలో నిలవడం గమనార్హం.
  • పీడీపీ -28, భాజపా -25, కాంగ్రెస్‌ -12, ఎన్సీపీకి - 15, ఇతరులు -7 సీట్లు గెలుచుకుంటారని'రిపబ్లిక్‌ మ్యాట్రిజ్‌'సంస్థ అంచనా వేసింది.
  • ఎన్‌సీ పార్టీకి 33 నుంచి 35 సీట్లు, కాంగ్రెస్‌కు 13 నుంచి 15 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్‌-సౌత్‌ఫస్ట్ సర్వే అంచనా వేసింది. బీజేపీ 23-27, పీడీపీ పార్టీకి 7-11 సీట్లు, ఇతరులకు 4-5 స్థానాలు వస్తాయని పేర్కొంది.
  • కాంగ్రెస్, ఎన్‌సీ కూటమికి 34 నుంచి 40 స్థానాలు వస్తాయని దైనిక్ భాస్కర్ అంచనా వేసింది. బీజేపీకి 20-25, పీడీపీకి 4-7, ఇతరులకు 12 నుంచి 16 స్థానాలు వస్తాయని దైనిక్‌ భాస్కర్‌ పేర్కొంది.
  • నేషనల్‌ కాన్ఫరెన్స్‌- కాంగ్రెస్‌ కూటమికి 40-48 సీట్లు రావొచ్చనిఇండియాటుడే- సీఓటర్‌ సర్వే అభిప్రాయపడింది. బీజేపీకి 27-32, పీడీపీకి 6-12, ఇతరులకు 6-11 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
  • యాక్సిస్‌ మై ఇండియాసర్వే సంస్థ సైతం నేషనల్‌ కాన్ఫరెన్స్‌- కాంగ్రెస్‌కు 35-45 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 24-34, పీడీపీ 4-6, ఇతరులకు 8-23 సీట్లు రావొచ్చని తెలిపింది.
Last Updated : Oct 5, 2024, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details