India Security Sheikh Hasina Jet : బంగ్లాదేశ్‌లో గతకొన్ని రోజులుగా తలెత్తిన ఆందోళనకర పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ వచ్చింది. సోమవారం అది తీవ్రరూపం దాల్చడం వల్ల ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో భారత్ మరింత అప్రమత్తమైంది. షేక్ హసీనా భారత్‌కు వస్తున్నారని తెలుసుకున్న మన భద్రతా దళాలు గగనతలంపై నిఘా వేశాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే విమానం భారత్‌లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని నిర్ణయించాయి.
రఫేల్ యుద్ధ విమానాలతోరక్షణ
భారత వాయుసేన రాడార్లు బంగ్లాదేశ్ గగనతలాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అటు నుంచి ఓ విమానం వస్తున్నట్లు మన భద్రతా బలగాలు గమనించాయి. ఆ విమానంలో ఎవరు వస్తున్నారో ముందే పసిగట్టిన అధికారులు దాన్ని భారత్‌లోకి అనుమతించాలని ఆదేశించారు. పైగా ఆ విమానానికి రక్షణ కల్పించేందుకు బంగాల్లోని హాసీమారా వైమానిక స్థావరం నుంచి 101 స్వ్కాడ్రన్‌లోని రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. హసీనా ప్రయాణిస్తున్న విమానానికి బిహార్, ఝార్ఖండ్ మీదుగా అవి రక్షణ కల్పించాయి.
స్పెషల్ కేర్
మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లోని హిండన్ విమానాశ్రయంలో దిగే వరకు భద్రతా ఏజెన్సీలు హసీనా విమానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. అందులో ఉన్న సిబ్బందితో భారత్ దళాలకు చెందిన ఉన్నతాధికారులే స్వయంగా సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలన్నింటినీ భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, పదాతిదళాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది నిశితంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో భద్రతాదళాలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు నిఘా విభాగాధిపతులు, జనరల్ ద్వివేది, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ జాన్సన్ ఫిలిప్ మాథ్యూ కలిసి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.