Himachal Pradesh Political Crisis :రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఓటమికి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు బాధ్యత వహించారని ఆ పార్టీ కేంద్ర పరిశీలకుడు డీకే శివకుమార్ చెప్పారు. సీఎం సుఖుతో పాటు, పార్టీ ఎమ్మెల్యేలు, హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ విభాగం చీఫ్ ప్రతిభా సింగ్‌తో మాట్లాడామని, విభేదాలన్ని తొలగిపోయాయని చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలను క్రమబద్ధీకరించడానికి సీఎం, డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సహా ముఖ్య నేతలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు శివకుమార్ ప్రకటించారు.
పరిస్థితి అంతా 'అండర్ కంట్రోల్'
హిమాల్చల్ప్రదేశ్లో పరిస్థితి అంతా అండర్ కంట్రోల్ ఉన్నట్లు కాంగ్రెస్ గురువారం తెలిపింది. ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేసి బీజేపీ విఫలమైందని చెప్పింది. అయితే ఇలా చేయడానికి బీజేపీ ధనబలం, ప్రభుత్వ బలం, కండబలం ఉపయోగించినా లాభం లేకపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు.
పావులు కదిపిన కాంగ్రెస్
హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నిక రాజేసిన రాజకీయ చిచ్చును ఆర్పేందుకు కాంగ్రెస్ వేగంగా పావులు కదిపింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ద్వారా అనర్హత వేటు వేయించింది. శాసనసభలో ఆర్థిక బిల్లు ఆమోదానికి ఓటు వేయాలని అధికార కాంగ్రెస్ ఇచ్చిన విప్‌ను ధిక్కరించారంటూ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు వేశారు. ఎమ్మెల్యేలు రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్, దేవిందర్ కుమార్, రవి ఠాకూర్, చేతన్య శర్మలపై అనర్హత వేటు వేసినట్లు స్పీకర్ తెలిపారు.
ఎమ్మెల్యేల అనర్హతపై బుధవారం తన తీర్పును రిజర్వ్ చేసిన స్పీకర్ పథానియా, పార్టీ గుర్తుపై ఎన్నికైనందున ఈ శాసనసభ్యులు కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించి ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని శిమ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు.