తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : May 31, 2024, 10:27 AM IST

ETV Bharat / bharat

వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి- 24గంటల్లో 50మంది బలి- ఆస్పత్రుల్లో అనేక మంది! - Heat Stroke Deaths In India

Heat Stroke Deaths : ఉత్తరాది రాష్ట్రాలతోపాటు ఒడిశాలో వేడి గాలులకు తట్టుకోలేక 50 మంది ప్రాణాలు విడిచారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికల జారీ చేసింది.

Heat Stroke Deaths
Heat Stroke Deaths (Source : ETV Bharat)

Heat Stroke Deaths : ఉత్తరాది రాష్ట్రాలను వేడి గాలులు కుదిపేస్తున్నాయి. దిల్లీ, రాజస్థాన్, హరియాణా, పంజాబ్, బిహార్‌లో వేసవి ఉష్ణోగ్రతలు పోటీపడుతున్నాయి. వేడి గాలులకు తట్టుకోలేక పలు రాష్టాల్లో గడిచిన 24 గంటల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశ రాజధాని దిల్లీలో వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

బిహార్​లో 26మంది బలి
బిహార్​లో ఎండ వేడిమికి 24 గంటల్లో 26 మంది మరణించారు. అందులో ఒక ఏఎస్‌ఐ, ఎన్నికల విధుల్లో ఉన్న సైనికుడు కూడా ఉన్నారు. బక్సర్‌ జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో గత 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. నవనగర్ పోలీస్​స్టేషన్ పరిధిలో అర్థరాత్రి జవాన్ మృతి చెందాడు. రోహ్తాస్‌లో ఇన్‌స్పెక్టర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ససారం సిటీ పోలీస్​స్టేషన్‌లోని కాళీస్థాన్ సమీపంలో ఒక మహిళ కూడా వేడిగాలుల కారణంగా మరణించింది. భోజ్‌పుర్‌లో ఎండ వేడిమికి ముగ్గురు వ్యక్తులు మరణించారు.

అర్రాలో ఎండ వేడిమికి ఐదుగురు పోలింగ్ సిబ్బంది మరణించారు. నలంద జిల్లాలో 24 గంటల్లో ఎండల తీవ్రతకు ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఉపాధ్యాయుడు, హోంగార్డు జవాన్‌, రైతు ఉన్నారు. మృతి చెందిన హోంగార్డు జవాన్‌ను రమేష్ ప్రసాద్ (54), ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ సిన్హా అలియాస్ సురేంద్ర ప్రసాద్‌గా గుర్తించారు. పశ్చిమ చంపారన్‌లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వివిధ జిల్లాల్లో వడదెబ్బకు గురై పదుల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రిలో చేరుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

ఝార్ఖండ్​లో 8మంది మృతి
ఝార్ఖండ్​లోని పలామూలో వేడి గాలులు తట్టుకోలేక 8 మంది మరణించారు. పలామూ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ మేదినీనగర్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్ వికాస్ కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనతోపాటు మరికొందరు చనిపోయారు. దాల్తోన్‌గంజ్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వృద్ధురాలు వడదెబ్బకు గురై మృతి చెందింది. హుస్సేనాబాద్‌ సబ్‌డివిజన్‌ ​​పరిధిలో ఓ రైల్వే కార్మికుడు, ఇద్దరు గృహిణులు, ఓ చిన్నారి వడదెబ్బకు గురై మృతి చెందారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత ఎక్కువ నీరు తాగాలని పాలము సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ సింగ్‌ సూచించారు.

ఒడిశాలో 16 మంది
ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లా రవుర్కెలా ప్రభుత్వాసుపత్రిలో అదే జిల్లాకు చెందిన 10 మంది, సుందర్‌గఢ్‌ ఆస్పత్రిలో మరో ఆరుగురు మృతి చెందారు. బాధితుల శరీర ఉష్ణోగ్రతలు పరిశీలించిన వైద్యులు మృతికి కారణం వడదెబ్బేనని ప్రాథమికంగా తేల్చినా పోస్టుమార్టం నివేదికలు వస్తేనే మరింత స్పష్టత ఇవ్వగలమని ప్రకటించారు. సుందర్‌గఢ్‌ జిల్లా వాసులు మృతి చెందడానికి గల కారణాలు తెలుసుకునేందుకు నిపుణుల బృందాన్ని నియమించినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details