Hathras Stampede Incident : ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవటం వల్లనే ఘోరం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చనిపోయినవారి మృతదేహాల గుర్తింపు కొనసాగుతోంది. సికంద్రరావ్ ఆస్పత్రి వద్ద మృతదేహాలు నేలపైనే చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొన్నింటిని మంచు దిబ్బలపై ఉంచారు. ఇక స్పృహ కోల్పోయినవారు కూడా మృతదేహాల పక్కనే పడి ఉన్నారు. గాయపడిన వారు ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద నేలపైనే పడుకుని కనిపించారు. వాళ్ల చుట్టూ బంధువులు ఉన్నారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని, ఆక్సిజన్ కూడా లేదని బంధువులు అంటున్నారు. మృతదేహాల గుర్తింపు కోసం మరి కొన్నింటిని సమీపంలోని ట్రామా సెంటర్, మరికొన్నింటిని ఎటా జిల్లా ప్రభుత్వాస్పత్రిలో భద్రపరిచారు.
దర్యాప్తునకు ఆదేశం
హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 24గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆగ్రా అదనపు డీజీపీ, అలీగఢ్ డివిజనల్ కమిషనర్ దర్యాప్తు బృందంలో ఉన్నారు. హథ్రాస్‌లో జరిగిన సత్సంగ్ ప్రైవేటు కార్యక్రమమని, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అనుమతి ఇచ్చినట్లు జిల్లా మెజిస్ట్రేట్ ఆశీశ్ కుమార్ తెలిపారు. జిల్లా యంత్రాంగం వేదిక వెలుపల భద్రతా ఏర్పాటు చేయగా లోపలి ఏర్పాట్లన్నీ నిర్వాహకులే చేసుకున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు యూపీ సర్కార్ తెలిపింది.
విదేశీ దౌత్యవేత్తల సంతాపం
ఈ ఘటనపై తమిళనాడు గవర్నర్, సీఎం, కేరళ ముఖ్యమంత్రితో పాటు విదేశీ రాయబారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు కేరళ సీఎం పినరయి విజయన్. అలాగే గాయపడిన వారు తర్వగా కోలుకోవాలని, ఇలాంటి కష్టసమయంలో నష్టపోయిన ప్రజలకు అండగా ఉంటామని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్ అన్నారు. ఇక భారతదేశంలో ఇజ్రాయెల్ దౌత్యవేత్త నౌర్ గిలోన్, చైనా రాయబారి జు ఫీహాంగ్, బ్రిటిష్ హై కమిషనర్ లిండీ కామెరూన్, ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ, జర్మన్ దౌత్యవేత్త ఫిలిప్ అకెర్మాన్ ఈ ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలిపారు.