Farmers Govt Talks :కనీస మద్దతు ధర సహా ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న కర్షకులతో కేంద్రం మరో విడత చర్చలు జరిపేందుకు ఆహ్వానించినప్పటికీ రైతు సంఘాలు నిరాకరించాయి. ఓ వైపు రైతులు బుల్లెట్లను ఎదుర్కొంటుండగా, మరో వైపు కేంద్రం చర్చలకు పిలుస్తోందని రైతు సంఘం నేత అభిమన్యు కొహిర్ ఆరోపించారు. అందుకే కేంద్రంతో చర్చలకు సిద్ధంగా లేమని ఆయన తెలిపారు.
నిరసనల్లో పాల్గొన్న యువరైతు శుభకరణ్ సింగ్ మరణానికి కారణమైన వారిపై హత్య కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. రైతు మరణానికి కారణమైన హరియాణ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది. రైతు మృతికి సంతాపంగా దేశంలో శుక్రవారం 'బ్లాక్ డే' పాటిస్తామని పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని ప్రకటించింది. ఫిబ్రవరి 26న రైతులు హైవేలపై ట్రాక్టర్ మార్చ్‌లు నిర్వహిస్తారని, మార్చి 14న దిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఆల్ ఇండియా ఆల్ కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్‌ను నిర్వహిస్తారని పేర్కొంది.