Director Manikandans Residence Robbed :ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణికందన్ ఇంట్లో కొందరు దుండగులు ఇటీవల చోరీకి పాల్పడి ఆయన జాతీయ అవార్డు పతకాలను ఎత్తుకెళ్లి పోయారు. ఈ ఘటన సంచలనంగా మారడం వల్ల, దొంగలు మణికందన్ జాతీయ అవార్డుల పతకాలు తిరిగి ఇచ్చేశారు. ఒక పాలిథిన్ కవర్లో కట్టి గోడకు తలిగించి వెళ్లారు. దాంతోపాటు ఓ క్షమాపణ లేఖను కూడా వదిలి వెళ్లారు. అందులో 'సారీ సర్- మమ్మల్ని క్షమించండి.' అని నోట్ రాశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది
ఇటీవల డైరెక్టర్ మణికందన్ ఇంట్లో కొందరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. మధురైలోని ఉసిలంపట్టిలోని ఈ ఘటన జరిగింది. డైరెక్టర్ నివాసానికున్న ఇంటి తాళాన్ని పగులగొట్టిన ఆ వ్యక్తులు, అక్కడ నుంచి సుమారు రూ.లక్ష నగదు, ఐదు సవర్ల విలువైన బంగారు నగలను చోరీ చేశారు. అంతే కాకుండా డైరెక్టర్ సాధించిన జాతీయ అవార్డులకు సంబంధించిన రజత పతకాలను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేసి
ఇక డైరెక్టర్ మణికందన్ కెరీర్ విషయానికి వస్తే - తమిళనాడులోని మధురై జిల్లా, ఉసిలంపట్టిలో జన్మించిన ఆయన స్కూలింగ్ పూర్తి చేసిన తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశారు. అయితే ఫొటోగ్రఫీపై ఉన్న ఆసక్తిని పెంచుకున్న మణికందన్ తొలుత వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇదికాకుండా స్కూల్, కాలేజీ పిల్లలకు ఐడీ కార్డులు తయారు చేయడం లాంటి చిన్న ఉద్యోగాలు కూడా చేసేవారు. రాజీవ్ మేనన్ నిర్వహించే ఫిలిం స్కూల్ అయిన మైండ్‌స్క్రీన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో డిజిటల్ ఫోటోగ్రఫీలో కోర్సును అభ్యసించడానికి డబ్బు కోసం ఆయన ఇవన్ని చేశారంటూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.