CEC On Electoral Bonds :రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు ఎస్‌బీఐ నుంచి అందాయని, వాటిని గడువులోగా బహిర్గతం చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం సాయంత్రంలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఈసీకి సదరు డేటాను అందించింది.
'శుక్రవారం అన్నీ వివరాలు ప్రజల్లోకి'
'ఎస్‌బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలకు సంబంధించి మార్చి 12వ తేదీ నాటికి మాకు డేటా అందాల్సి ఉంది. అది మా వద్దకు ఇప్పటికే చేరింది. ప్రజలకు అన్ని వివరాలు వెల్లడిస్తాం. పారదర్శకత విషయంలో కమిషన్ అనేది ఎప్పుడూ ముందుంటుంది. గడువులోగా ఆ వివరాలన్నింటినీ బహిర్గతం చేస్తాం' అని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
'లోక్‌సభ ఎన్నికలకు మేం సిద్ధం'
మరోవైపు లోక్‌సభ ఎన్నికల గురించి కూడా మాట్లాడారు రాజీవ్ కుమార్. మరికొద్ది వారాల్లో జరగనున్న ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జమ్ముకశ్మీర్‌తో పాటు దేశంలో సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని పలు పార్టీలు నివేదించినట్లు తెలిపారు. నాయకులందరికీ సమానమైన భద్రతను కల్పించాలని పలు పార్టీల నాయకులు తమను కోరినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.