ఆలయ ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనలో అపశృతి.. క్రేన్ పక్కకు ఒరిగి పలువురికి గాయాలు
🎬 Watch Now: Feature Video
Temple Inauguration Ceremony Accident at Suryapet: సూర్యాపేట జిల్లాలో ఆలయ ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకొంది. జిల్లాలోని మద్దిరాల మండల పరిధిలోని రెడ్డిగూడెం గ్రామంలో పురాతన సీతారామాంజనేయులు స్వామి ఆలయం పునఃనిర్మాణంలో భాగంగా ఆలయ ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి గ్రామస్థులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో సుమారు 50 అడుగుల పొడవున్న రాతి ధ్వజస్తంభాన్ని రెండు క్రేన్ల సహాయంతో ప్రతిష్ఠాపన చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ధ్వజస్తంభం బరువంతా ఒక్కదానిపైనే పడటంతో ఒక్కసారిగా క్రేన్ ఓ వైపునకు ఒరిగిపోయింది. దీంతో క్రేన్‌తో పాటుగా ధ్వజస్తంభం కూడా అక్కడున్న జనాలపై పడింది. ప్రమాదంలో సుమారుగా 15మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే హుటాహుటినా 108 సహయంతో సూర్యాపేటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎంతో సంతోషంగా ఊరంతా ఒక్క దగ్గర చేరి పెద్ద పండుగగా ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఇలాంటి ప్రమాదం చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.