కరోనా వచ్చి ఆర్నెల్లు దాటింది. అయినా మందులెందుకు తయారు చేయటం లేదు? ఇలా ఇంకెంత కాలం? రోజురోజుకీ కొత్త కరోనా జబ్బు పెరగటమే గానీ తగ్గుతున్న దాఖాలేవీ కనిపించని తరుణంలో అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్నలివి. వైరస్‌ల పనిపట్టే మందుల తయారీ అనుకున్నంత తేలిక కాదు. వైరస్‌లు బ్యాక్టీరియాల్లాంటివి కావు. ఇవి కణంలోకి చొచ్చుకెళ్లి, దాన్ని ఆధీనంలోకి తెచ్చుకొని తమకు అనుగుణంగా పనిచేయించుకుంటాయి. తామరతంపరగా వృద్ధి చెందుతుంటాయి. దీన్ని అరికట్టాలంటే వైరస్ జీవిత చక్రంలోని కీలకమైన భాగాన్ని దెబ్బతీయాల్సి ఉంటుంది. మన కణాలకు హాని కలగకుండా వైరస్‌ను చంపాల్సి ఉంటుంది. మరోవైపు వైరస్‌లు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. ఎప్పటికప్పుడు తమ రూపాన్ని మార్చేసుకుంటూ రోగనిరోధకశక్తిని బురిడీ కొట్టిస్తుంటాయి. మందులను, టీకాలను తట్టుకునే శక్తినీ సంతరించుకుంటూ వస్తుంటాయి. అందుకే వైరల్ మందుల తయారీ చాలా సంక్లిష్టమైన ప్రక్రియగా సవాల్ విసురుతోంది. అలాగని పూర్తిగా నిరాశ పడాల్సిన పనిలేదు. కొత్త మందులు రాకపోయినా ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇతరత్రా మందులు ఎన్నో ప్రాణాలను నిలబెడుతున్నాయి.
యాంటీ వైరల్ మందులు
వైరస్‌లను చంపే మందులు చాలా తక్కువ. అందుకే ఉన్నవాటితోనే కరోనా పని పట్టటానికి వైద్యులు శతథా ప్రయత్నిస్తున్నారు. వీటిని ఇన్‌ఫెక్షన్ తొలిదశలోనే వాడుకోవాల్సి ఉంటుందన్నది గమనార్హం. సాధారణంగా కరోనా వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక 4-6 రోజుల్లో ప్రభావం చూపిస్తుంది. తర్వాత క్రమంగా బలహీనమవుతూ.. 9 రోజుల్లో దాదాపుగా నిర్వీర్యమైపోతుంది. అందువల్ల యాంటీవైరల్ మందులను 3-9 రోజుల వ్యవధిలోనే ఇవ్వాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు గానీ తర్వాత గానీ ఇస్తే పెద్దగా ఉపయోగముండదు.
రెమ్‌డెసివిర్
కొవిడ్-19 అత్యవసర చికిత్సలో వాడుకోవటానికి దీనికి చాలా దేశాలు అనుమతించాయి. అసలు దీన్ని రూపొందించింది హెపటైటిస్ సి చికిత్స కోసం. కానీ ఆశించిన ఫలితం కనిపించలేదు. అనంతరం ఎబోలా ఇన్‌ఫెక్షన్ వంటి ఇతర జబ్బుల్లో వాడుకోవటం ఆరంభించారు. ఇది మెర్స్, సార్స్ జబ్బులకు కారణమయ్యే కరోనా వైరస్‌లు వృద్ధి చెందకుండా, వ్యాపించకుండా నిరోధిస్తున్నట్టు గత అధ్యయనాలు చెబుతున్నాయి. సార్స్ కోవ్2 సైతం సార్స్, మెర్స్ కారక కరోనా వైరస్‌ల కోవకు చెందినదే. అందుకే రెమ్‌డెసివిర్‌కు ప్రాధాన్యం పెరిగింది. కరోనా వైరస్‌లు వృద్ధి చెందటానికి ప్రత్యేకమైన ఎంజైమ్‌ను తయారుచేసుకుంటాయి. రెమ్‌డెసివిర్ సరిగ్గా దీని మీదే దాడి చేస్తుంది. కరోనా వైరస్ వృద్ధి చెందకుండా, ప్రతిరూపాలు పుట్టకుండా నిలువరిస్తుంది. అంతేకాదు, కరోనాతో దెబ్బతిన్న ఊపిరితిత్తులు కోలుకోవటానికీ తోడ్పడుతుంది. రెమ్‌డెసివిర్ వాడకంతో మరణాలు తగ్గటమే కాదు, జబ్బు నుంచి త్వరగా కోలుకుంటున్నట్టూ బయటపడింది. ఇది వెంటిలేటర్ మీద, హార్ట్ లంగ్ మిషన్ మీదున్నవారికి మాత్రం అంతగా ఉపయోగపడదనే చెప్పుకోవాలి.
ఫ్లూ వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లకు ఉద్దేశించిన మంచిది . జపాన్‌లో చాలాకాలంగా వాడుతున్నదే. ఆర్‌ఎన్‌ఏ ఆధారిత వైరస్‌ల మీద బాగా పనిచేసే ఇది కరోనా జబ్బు ఒక మాదిరిగా గలవారికి ఉపయోగపడగలదనీ భావిస్తున్నారు. కరోనా వైరస్ కణాల్లోకి చేరాక ఆర్‌ఎన్‌ఏ పాలిమరేజ్ ఎంజైమ్ సాయంతో వృద్ధి చెందుతుంది. ఫావిపిరవిర్ సరిగ్గా దీన్నే నిలువరిస్తుంది. ఇన్‌ఫెక్షన్ తొలిదశలోనైతే బాగా పనిచేస్తుంది. రోగనిరోధకశక్తి గతి తప్పిన తర్వాత అంతగా ఉపయోగపడదు. కిడ్నీ, కాలేయ జబ్బులతో బాధపడేవారికి.. గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు దీన్ని ఇవ్వటం తగదు.
వాపు నివారకాలు
కరోనా జబ్బులో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) ప్రేరేపితం కావటం తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తోంది. దీన్ని తగ్గించటానికి పారాసిటమాల్, ఆస్ప్రిన్, ఇండోమెథాసిన్ వంటివే కాదు.. ఇతరత్రా మందులూ తోడ్పడుతున్నాయి. వైరస్ ఉద్ధృతంగా ఉన్నప్పుడూ, తర్వాత ఉపయోగపడుతున్నాయి.
హైడ్రాక్సీ క్లోరోక్విన్
ఒక మాదిరి లక్షణాలు గలవారికే కాదు, కరోనా నివారణకూ దీన్ని వాడుకోవచ్చని ఐసీఎంఆర్ అనుమతించింది. నిజానికిది మలేరియా మందు. ల్యూపస్, రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్ వంటి జబ్బుల్లోనూ వాడుతున్నారు. ఇది కొత్త కరోనా వైరస్‌నూ చంపుతున్నట్టు తేలటం గమనార్హం. కణాల్లోకి వైరస్ ప్రవేశించకుండా, వృద్ధి చెందకుండా కాపాడుతుంది. ఒకవేళ కణాల్లోకి వైరస్ ప్రవేశించినా వృద్ధి చెందకముందే దాన్ని చంపేస్తుంది. అయితే దీంతో కొన్ని దుష్ప్రబావాలు లేకపోలేదు. కొందరిలో గుండె లయ దెబ్బతినొచ్ఛు.
డెక్సామెథసోన్
- ఇదో కార్టికో స్టిరాయిడ్. అంతటా అందుబాటులో ఉన్న మందు. చవకైంది కూడా. ఇది రోగనిరోధక ప్రతిస్పందనలను నియంత్రిస్తూ సైటోకైన్ల ఉప్పెన తలెత్తకుండా చేస్తుంది. కొవిడ్ మరణాలను గణనీయంగా తగ్గిస్తుండటం విశేషం. తీవ్ర కొవిడ్‌తో బాధపడుతూ ఆక్సిజన్ చికిత్స తీసుకుంటున్నవారికి, వెంటి లేటర్ మీదున్నవారికి బాగా ఉపయోగ పడుతున్నట్టు బ్రిటన్ పరిశోధకులు గుర్తించారు.
- ప్రెడ్నిసోన్, మిథైల్ ప్రెడ్నిసోలాన్ వంటి స్టిరాయిడ్లూ వాపు ప్రక్రియను నిలువరిస్తూ దుష్ప్రభావాలు తలెత్తకుండా కాపాడతాయి.
యాంటీ యాంటీబాడీలు
- రోగనిరోధకశక్తి బలంగా ఉండటమే కాదు.. అది అతిగా స్పందించకపోవటమూ ముఖ్యమే. కరోనా జబ్బు తీవ్రమైనవారిలో రోగ నిరోధకశక్తి అతిగా స్పందించటమే ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. దీన్ని నిలువరించటానికి ఉపయోగపడేవే యాంటీ యాంటీబాడీలు. వీటిని రోగనిరోధకశక్తి గతి తప్పిన సమయంలోనే ఇవ్వాల్సి ఉంటుంది.
- ఇది జంతువుల్లో రూపొందించిన యాంటీబాడీ (హ్యూమనైజ్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ). నిజానికిది కీళ్లవాతం మందు. పిల్లల్లో తలెత్తే కీళ్లవాతంలోనూ చాలాకాలంగా వాడుతున్నారు. రోగనిరోధక ప్రతిస్పందనలో కీలక పాత్ర పోషించే ఐఎల్-6 అనే సైటోకైన్లు ఉన్నట్టుండి ఉప్పెనలా దాడిచేయకుండా కాపాడుతుంది. అప్పటికే రోగనిరోధకశక్తి విపరీతంగా ప్రేరేపితమైనవారికి ఉపయోగపడుతుంది.
- ఇది యాంటీ సీడీ6 మోనోక్లోనల్ యాంటీబాడీ. చాలాకాలంగా దీన్ని సోరియాసిస్ చికిత్సలో వాడుతున్నారు. ఇది సైటోకైన్ల ఉప్పెన ఆలస్యమయ్యేలా, నెమ్మదించేలా చేస్తుంది. ఒక మాదిరి నుంచి మధ్యస్థంగా జబ్బు గలవారికి అత్యవసరమైతే దీన్ని వాడుతున్నారు. రోగనిరోధక ప్రతిస్పందన విపరీతంగా స్పందించటానికి ముందే దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
విటమిన్లు ఖనిజాలు
రోగనిరోధకశక్తి సమర్థంగా పనిచేయటానికి విటమిన్ డి, విటమిన్ సి, జింక్ మాత్రలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
అనుబంధ ఔషధాలు
ఆసుపత్రిలో చేరిన కొందరు కొవిడ్ బాధితుల్లో రక్తం గడ్డలు కడుతుండటం ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. దీన్ని నివారించటానికి రక్తాన్ని పలుచగా చేసే హెపారిన్ వంటి మందులు ఉపయోగపడుతున్నాయి. ఇంజెక్షన్ రూపంలో చర్మం కింద వీటిని ఇస్తే మంచి ఫలితం కనిపిస్తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా భావిస్తున్నారు. హెపారిన్ వాడకంలో జాగ్రత్త అవసరం. దీంతో రక్తనాళాల్లోంచి రక్తం లీకయ్యే ప్రమాదముంది.
ఇది కొవిడ్ చికిత్సలో తాజాగా వెలుగులోకి వచ్చిన మందు. ట్రైగ్లిజరైడ్లు తగ్గటానికి తోడ్పడే ఫెనోఫైబ్రేట్ కరోనా జబ్బులోనూ ఉపయోగపడుతున్నట్టు ఇజ్రాయెల్ అధ్యయనం పేర్కొంటోంది. ఇది కొవిడ్ తీవ్రతను మామూలు జలుబు స్థాయికి తగ్గించెయ్యగలదనీ భావిస్తున్నారు. పిండి పదార్థం శక్తిగా మారే ప్రక్రియను కొత్త కరోనా వైరస్ అడ్డుకుంటున్నట్టు, ఫలితంగా ఊపిరితిత్తుల కణాల్లో కొవ్వులు పెద్దఎత్తున పోగుపడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వైరస్‌లు విభజన చెందటానికి ఈ కొవ్వులనే ఉపయోగించుకుంటున్నాయి. ఈ ప్రక్రియను ఫెనోఫైబ్రేట్ దెబ్బతీస్తుంది.
అజిత్రోమైసిన్
ఇది యాంటీబయోటిక్ మందు. నిజానికి యాంటీబయోటిక్ మందులు వైరల్ ఇన్‌ఫెక్షన్లకు పనిచేయవు. వైరల్ ఇన్‌ఫెక్షన్ల అనంతరం తలెత్తే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు తగ్గటానికి ఉపయోగపడతాయి. అయితే అజిత్రోమైసిన్ అంతవరకే పరిమితం కావటం లేదు. కొంతవరకు వాపు ప్రక్రియ తగ్గటానికీ తోడ్పడుతుంది. ఇదే కొవిడ్-19 చికిత్సలో పనికొస్తోంది. కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌కు రోగనిరోధకశక్తి అతిగా స్పందించకుండానూ చూస్తుంది. టెట్రాసైక్లిన్ తరగతికి చెందిన డాక్సీసైక్లిన్ మందు సైతం ఎంతగానో ఉపయోగపడుతోంది.
ఐవర్‌మెక్టిన్
అవటానికిది నులి పురుగులను తగ్గించే మందే అయినా యాంటీవైరల్‌గానూ పనిచేస్తుంది. ముఖ్యంగా ఆర్‌ఎన్‌ఏ వైరస్‌ల మీదా కొంతవరకు పనిచేస్తుంది. సార్స్ సీవోవీ2 కూడా ఆర్‌ఎన్‌ఏ వైరసే. ఐవర్‌మెక్టిన్ 48 గంటల్లోనే వైరస్ పదార్థాలన్నింటినీ దాదాపుగా నిర్మూలిస్తున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇది వైరస్ ప్రొటీన్లు కణ కేంద్రకంలోకి వెళ్లటానికి తోడ్పడే గ్రాహకాలను నిలువరిస్తుంది.