నోటి దుర్వాసన తరచూ చూసేదే. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో దీన్ని ఎదుర్కొన్నవారే అన్నా అతిశయోక్తి కాదు. మనం శ్వాస ద్వారా ఆక్సిజన్‌ను తీసుకొని, కార్బన్ డయాక్సైడ్‌ను వదులుతాం కదా. దీనికి ఎలాంటి వాసనా ఉండదు. అయితే సల్ఫర్, నైట్రోజన్, యూరియా వంటి రసాయనాలు ఆవిరి రూపంలో శ్వాసలో కలిసినప్పుడు వాసనకు దారితీస్తుంది. మనం తినే ఆహార పదార్థాలు, అలవాట్లు, జబ్బుల వంటివేవైనా దీనికి దారితీయొచ్చు. ఇది వాసనకు సంబంధించిన సమస్యే అయినా సామాజిక జీవితం మీదా ప్రభావం చూపుతుంది. మన రోజువారీ వ్యవహారాలన్నీ మాటలతో సాగేవే. నోటి దుర్వాసన వస్తుంటే ఇతరులతో సన్నిహితంగా మెలగటం ఎలా సాధ్యం? వాసనను తట్టుకునే సామర్థ్యం సంతరించుకోవటమో, ముక్కులో వాసనను పసిగట్టే వ్యవస్థ అస్తవ్యస్తం కావటమో.. కారణమేదైనా నోటి దుర్వాసన వచ్చేవారికి ఆ విషయం తెలియదు. సన్నిహితంగా మెలిగేవారికే అది తెలుస్తుంది. దీంతో ఎదుటివారు దూరంగా పోతుండటం కలవరానికి గురిచేస్తుంది. ఫలితంగా నలుగురితో కలుపుగోలుగా తిరగలేక కొందరు ఒత్తిడి, ఆందోళనకూ గురవుతుంటారు. మానసికంగానూ కుంగిపోతుంటారు. కాబట్టి సమస్య చిన్నదే అయినా నిర్లక్ష్యం చేయటం తగదు.
ఎందుకీ దుర్వాసన?
- నోటి దుర్వాసనకు రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. దీనికి మూలం చాలావరకూ నోరే. ముక్కు, ముక్కు చుట్టుపక్కలుండే గాలిగదులు, గొంతు, ఊపిరితిత్తులు, అన్నవాహిక, జీర్ణాశయంలో తలెత్తే సమస్యలూ దుర్వాసనకు దారితీయొచ్చు. అరుదుగా కాలేయ వైఫల్యం, కీటోఅసిడోసిస్ వంటివీ కారణం కావొచ్చు.
నోరు శుభ్రం చేసుకోకపోవటం: ప్రధాన కారణం ఇదే. మన నోట్లో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. శ్వాసను వదులుతున్నప్పుడు తేమ 96 శాతానికీ చేరుకుంటుంది. బ్యాక్టీరియా వృద్ధి చెందటానికిది అనువుగా వాతావరణాన్ని కల్పిస్తుంది. నోట్లో 500కు పైగా బ్యాక్టీరియా రకాలు ఉంటాయని అంచనా. వీటిల్లో చాలావరకు వాసనలను పుట్టించేవే. ఇలాంటి పరిస్థితుల్లో నోటిని సరిగా శుభ్రం చేసుకోనట్టయితే వాసనను పుట్టించే బ్యాక్టీరియా తామరతంపరగా వృద్ధి చెందుతుంది. మనం తిన్న ఆహార పదార్థాల ముక్కలు పళ్ల మధ్య, నాలుక, చిగుళ్ల మీద చిక్కుకున్నప్పుడు బ్యాక్టీరియా పోగుపడి, అది క్రమంగా పొరలా ఏర్పడుతుంది. ఈ బ్యాక్టీరియా లాలాజలంలోని గ్లూకోజు, పెప్టైడ్లు, ప్రొటీన్ల వంటి కర్బన పదార్థాలను క్షీణింపజేసే క్రమంలో వాసన పుట్టించే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి శ్వాసలో కలిసి దుర్వాసన కలిగిస్తాయి.
చిగుళ్ల వాపు: విడవకుండా నోటి దుర్వాసన వేధిస్తుండటం చిగుళ్ల జబ్బుకు సంకేతం కావొచ్చు. పళ్ల మీద బ్యాక్టీరియా, ఆహార పదార్థాలు పోగుపడుతూ వస్తుంటే చివరికది గట్టిపడి, గారగా మారుతుంది. దీనిలోని బ్యాక్టీరియా విషతుల్యాలను పుట్టించి చిగుళ్లను చికాకు పరస్తుంది. క్రమంగా ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది. దీంతో చిగుళ్లు ఉబ్బి, ఎర్రగా అవుతాయి. రక్తం కారొచ్చు. ఇన్‌ఫెక్షన్ మూలంగా చిగుళ్లలో అనుసంధాన కణజాలం ఏర్పడుతుంటుంది. ఇది కుళ్లిన మాంసం వాసన వచ్చేలా చేస్తుంది.
పిప్పి పళ్లు: పుచ్చిపోయిన దంతాల్లో ఆహార పదార్థాలు చిక్కుకుపోతాయి. కుళ్లిపోతున్నకొద్దీ ఇవి చెడు వాసన కలిగిస్తాయి.
జ్ఞాన దంతం: కొందరికి జ్ఞానదంతం వేర్వేరు దిశల్లో పైకి మొలుస్తుంటుంది. దీంతో పంటి చుట్టుపక్కల చిగుళ్లలో ఇన్‌ఫెక్షన్ తలెత్తుతుంది. కొన్నిసార్లు అక్కడ ఆహార పదార్థాలూ చిక్కుకోవచ్చు. సరిగా బ్రష్ చేసుకోకపోతే అవి కుళ్లిపోయి, వాసనకు దారితీయొచ్చు.
మిశ్రమ దంతాలు: పిల్లల్లో ఒకవైపు పాల పళ్లు ఊడిపోతూ, మరోవైపు శాశ్వత దంతాలు మొలుస్తుంటాయి. ఇలాంటి సమయంలో పళ్లు మొలిచే చోట కొన్ని మార్పులు తలెత్తుతుంటాయి. ఇవి చిగుళ్లు ఉబ్బటానికి దారితీయొచ్చు. ఇదీ చెడు వాసనకు దారితీయొచ్చు.
బరేసెస్ వంటి పరికరాలు: దంతాల అమరిక కోసం వాడే బ్రేసెస్, కట్టుడు పళ్ల వంటి వాటిని సరిగా శుభ్రం చేసుకోకపోయినా చెడు వాసన రావొచ్చు.
నోరు ఎండిపోవటం: లాలాజల ప్రవాహం నోట్లో కణజాలాలను తడిగా ఉంచుతుంది. ఆహార పదార్థాలను తొలగిస్తూ నోటిని శుభ్రం చేస్తుంది బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బ తినకుండా కాపాడుతుంది కూడా. లాలాజల ప్రవాహం తగ్గిపోతే నోరు ఎండిపోతుంది. ఫలితంగా శుభ్రపడే పక్రియ దెబ్బతింటుంది. ఇది దుర్వాసనకు దారితీస్తుంది. మధుమేహం వంటి జబ్బులు.. అధిక రక్తపోటు, కుంగుబాటు, మానసిక సమస్యలను తగ్గించే మందులు.. మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందులు.. కీమోథెరపీ, రేడియో థెరపీ వంటివన్నీ నోరు ఎండిపోవటానికి కారణమవుతాయి.
ఆహార పదార్థాలు: కొన్ని పదార్థాల్లో వాసన కలిగించే రసాయనాలుంటాయి. వీటిని జీర్ణప్రక్రియ ద్వారా శరీరం గ్రహిస్తుంది. అనంతరం శ్వాస లేదా లాలాజలం ద్వారా బయటకు వెదజల్లుతుంది. ఇది వాసనకు కారణమవుతుంది. ఉదాహరణకు- ఉల్లిగడ్డ, వెల్లుల్లి వంటివి తిన్నామనుకోండి. వీటిల్లోని సల్ఫర్ రసాయనాలు రక్తం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటాయి. శ్వాస ద్వారా నోరు, ముక్కు నుంచి బయటకు వస్తాయి.
కొన్ని జబ్బులతోనూ..
పై శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు: టాన్సిల్ వాపు, ముక్కు ఇన్‌ఫెక్షన్లు, ముక్కు చుట్టుపక్కల గాలిగదుల ఇన్‌ఫెక్షన్లు తాత్కాలికంగా దుర్వాసనకు దారితీస్తాయి. టాన్సిల్ వాపు లేదా ఇన్‌ఫెక్షన్లకు వాడే మందులూ నోట్లో వికారమైన రుచిని కలిగించొచ్చు. నోరు ఎండిపోవటానికి, దుర్వాసనకు దారితీయొచ్చు. టాన్సిల్స్ జ్ఞానదంతానికి దగ్గరగా ఉంటాయి. అందువల్ల పళ్ల ఇన్‌ఫెక్షన్ టాన్సిల్స్‌కు, టాన్సిల్ ఇన్‌ఫెక్షన్ పళ్లకూ వ్యాపించొచ్చు.
జీర్ణకోశ సమస్యలు: గ్యాస్, అల్సర్లు నోటి దుర్వాసనకు కారణం కావొచ్చు. వేళకు తినకపోవటం, కొన్నిరకాల ఆహార పద్ధతులూ దీనికి దోహదం చేయొచ్చు.
మధుమేహం: దీని బారినపడ్డవారికి నోరు ఎండిపోవటం, చిగుళ్ల వాపు ముప్పు ఎక్కువ. ఇవి రెండూ దుర్వాసనకు దారితీసేవే. చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌తో వీరి నోటి నుంచి తీయటి వాసన వస్తుంటుంది. ఇన్సులిన్ మోతాదులు పడిపోయినప్పుడు వీరిలో శరీరం శక్తి కోసం చక్కెరకు బదులు కొవ్వు నిల్వలను వాడుకోవటం మొదలెడుతుంది. కొవ్వు విచ్ఛిన్నమయ్యే క్రమంలో కీటోన్లు విడుదలవుతాయి. వీటి మోతాదులు పెరిగితే నోటి నుంచి ఒకరకమైన వాసన వస్తుంది.
కిడ్నీ, కాలేయ సమస్యలు: అరుదుగా కిడ్నీ, కాలేయ వైఫల్యంతోనూ నోటి దుర్వాసన తలెత్తొచ్చు.
చికిత్స ఏంటి?
- నోటి దుర్వాసనకు కారణాన్ని గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది. చాలావరకు దీని మూలం నోట్లోనే ఉంటుంది. కాబట్టి నోటిని శుభ్రంగా ఉంచుకోవటం ప్రధానం. దీంతో బ్యాక్టీరియా వృద్ధి కాకుండా, పేరుకుపోకుండా చూసుకోవచ్చు.
- రోజూ ఉదయం నిద్ర లేచాక, రాత్రి పడుకోబోయే ముందు బ్రష్‌తో పళ్లను తోముకోవాలి. ప్రతి 2-3 నెలలకోసారి బ్రష్‌ను మార్చాలి. బ్రష్‌తో దంతాల మధ్య అంతగా శుభ్రం కాదు. అందువల్ల సన్నటి దారంతో (ఫ్లాస్) దంతాల మధ్య శుభ్రం చేసుకోవాలి. అవసరమైతే డాక్టర్‌ను సంప్రదించి పళ్లను, చిగుళ్లను శుభ్రం చేయించుకోవాలి. చిగుళ్ల జబ్బు చికిత్సలో యాంటీసెప్టిక్ ద్రావణంతో నోటిని శుభ్రం చేస్తారు. దీంతో బ్యాక్టీరియా సంఖ్య తగ్గుతుంది. కట్టుడు పళ్లు, బ్రిడ్జిలు, మౌత్ గార్డ్ అమర్చుకునేవారు రోజూ వాటిని శుభ్రం చేసుకోవాలి.
- బాక్టీరియా, ఆహారం, మృత కణాలు నాలుక మీద పేరుకొని పూతలా ఏర్పడతాయి. పొగ తాగేవారిలో, నోరు ఎండిపోయేవారిలో ఇదెక్కువ. పలుచటి బద్దతో నాలుక మీద గీకి, పూర్తిగా శుభ్రం చేసుకోవాలి.
- ద్రవాలు తగినంత తాగాలి. మద్యం, పొగాకు నోరు ఎండిపోయేలా చేస్తాయి కాబట్టి వీటిని మానెయ్యాలి. చక్కెరలేని చూయింగ్ గమ్ నమిలితే మంచిది. ఇది లాలాజలం ఊరేలా చేస్తుంది. ఒకవేళ దీర్ఘకాలంగా నోరు ఎండిపోతుంటే లాలాజలాన్ని ఉత్పత్తి చేసే మందులు ఉపయోగపడతాయి.
- ల్లిగడ్డలు, వెల్లుల్లి, ఘాటు వాసనలతో కూడిన మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలి. తీపి పదార్థాలూ దుర్వాసనకు దారితీయొచ్చు. కాబట్టి వీటిని మానేస్తే మంచిది. ఒకవేళ మిఠాయిల వంటివి తింటే వెంటనే నీటితో పుక్కిలించి నోటిని శుభ్రం చేసుకోవాలి. అల్పాహారంగా పచ్చి కూరగాయలు, పండ్ల ముక్కలను నమిలి తినటం మంచిది. ఇవి లాలాజలం ఊరేలా చేస్తాయి. నాలుక వెనక భాగంలో పేరుకున్న పాచిని తొలగిస్తాయి.
- నోరు ఎండిపోవటం, చిగుళ్ల వాపు వంటి సమస్యలుంటే తగు చికిత్స తీసుకోవాలి. మధుమేహలు గ్లూకోజును నియంత్రణలో ఉంచుకోవాలి. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, జీర్ణకోశ సమస్యలు, కాలేయ జబ్బు, కిడ్నీ వైఫల్యం వంటి సమస్యలతో దుర్వాసన వస్తుంటే ఆయా జబ్బులకు విధిగా చికిత్స తీసుకోవాలి.
నిర్ధారణ ఎలా?
ఎవరి నోటి వాసన వారికి తెలియదు. పక్కవాళ్లు చెబితేనో, వారి ప్రవర్తనతోనో తెలుస్తుంది. మాట్లాడుతున్నప్పుడు ఎదుటివాళ్లు ముఖం తిప్పుకోవచ్చు. దూరంగా జరగటానికి ప్రయత్నించొచ్చు. కొందరు తమకు అంతగా వాసన రాకపోయినా ఎక్కువగా వస్తుందనీ భావిస్తుండొచ్చు. కాబట్టి నిజంగా దుర్వాసన వస్తోందా? కేవలం మానసికమైన భావనేనా? అనేది నిర్ధరించటం చాలా ముఖ్యం. ఇందుకు కొన్ని పద్ధతులు ఉపయోగపడతాయి.
వాసన చూడటం: దీన్ని ఆర్గానోలెప్టిక్ మెజర్‌మెంట్ అనీ అంటారు. ఇది చాలా పాత పద్ధతి. తేలికైంది కూడా. ఖర్చేమీ కాదు. నోటి నుంచి వెలువడే గాలిని వాసన చూడటం దీనిలోని కీలకాంశం. ముక్కు ద్వారా గట్టిగా శ్వాస పీల్చుకొని, కాసేపు అలాగే బిగపట్టి నోటి ద్వారా వదిలినప్పుడు డాక్టర్లు 20 సెం.మీ. దూరం నుంచి దాన్ని వాసనతో గుర్తిస్తారు. అనంతరం 0-5 పాయింట్ల వరకు కేటాయిస్తారు. సున్నా అయితే ఎలాంటి వాసన లేదని, 3 అయితే ఒక మాదిరిగా ఉందని, 5 అయితే చాలా తీవ్రంగా వాసన ఉందని అర్థం.
గ్యాస్ క్రొమటోగ్రఫీ: దుర్వాసన నిర్ధరణకు దీన్ని ప్రామాణిక పరీక్షగా భావిస్తారు. ఇందులో నోట్లో కాసేపు బిగపట్టిన గాలిని సిరంజి ద్వారా సేకరించి పరికరంలోకి వదులుతారు. శ్వాసలో సూక్ష్మ స్థాయిలో ఉన్న వాసన కారకాలూ దీంతో బయటపడతాయి. ఇది వాసన కారకాలు క్షీణించకపోయినా వాటి నుంచి వెలువడే రసాయనాలను విశ్లేషిస్తుంది.
సల్ఫైడ్ పరిశీలన: ఇందులో నోటి నుంచి వెలువడే గాలిని సల్ఫైడ్ మానిటర్ల ద్వారా విశ్లేషిస్తారు. నోట్లో గాలిని కాసేపు బిగపట్టాక సల్ఫైడ్ మానిటర్లతో కూడిన గొట్టాన్ని లోపలికి దూరుస్తారు. ఇది గాలిని సేకరించి, సల్ఫర్ మోతాదులను తెలియజేస్తుంది. గ్యాస్ క్రొమటోగ్రఫీ కన్నా ఇది చవకైనది, తేలికైనదే గానీ అన్ని వాయువులను గుర్తించలేదు.
చెంచా పరీక్ష: నాలుక మీది పూతతో సమస్యను నిర్ధరించం మరో పద్ధతి. ఇందులో నాలుక వెనక భాగంలోని పూతను చెంచాతో గీకి, కాసేపయ్యాక 5 సెంటీమీటర్ల దూరం నుంచి వాసన చూస్తారు. దీన్ని బట్టి సమస్యను నిర్ధరిస్తారు.
ఫ్లాస్ పరీక్ష: ఇందులో దంతాల మధ్యలోంచి సన్నటి దారాన్ని (ఫ్లాస్) దూర్చి, సుమారు 3 సెంటీమీటర్ల దూరం నుంచి వాసన చూస్తారు.
లాలాజల పరీక్ష: లాలాజలాన్ని చిన్న పాత్రలో వేసి, వెంటనే మూత పెడతారు. ఐదు నిమిషాల సేపు 370 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఇంక్యుబేటర్‌లో పెడతారు. తర్వాత 4 సెంటీమీటర్ల దూరం నుంచి వాసన చూస్తారు. పాయింట్లను కేటాయించి తీవ్రతను లెక్కిస్తారు.
బనా పరీక్ష: ఇది అప్పటికప్పుడు చేసే పరీక్ష. ఇందులో ముందుగా దూదితో నాలుక మీద రుద్ది, నమూనాను సేకరిస్తారు. దీన్ని బెంజైల్-ఆర్జినైన్ నాఫ్తీలమైడ్‌తో కూడిన పట్టీపై వేసి, టోస్టర్ వంటి చిన్న పరికరంలో పెడతారు. అప్పుడది నీలి రంగులోకి మారుతుంది. రంగు గాఢతను బట్టి దుర్వాసనను నిర్ధరిస్తారు. ఇది వాసనకు కారణమయ్యే కొవ్వు ఆమ్లాలు, నోట్లో తిష్ఠ వేసుకునే గ్రామ్ నెగెటివ్ అనరోబిక్ బ్యాక్టీరియా ఆధారంగా సమస్యను గుర్తిస్తుంది. దీంతో దుర్వాసననే కాదు, చిగుళ్ల జబ్బు ముప్పునూ అంచనా వేయొచ్చు.
స్వీయ పరీక్ష: దుర్వాసన వస్తుందో లేదో ఎవరికి వారు పరీక్షించుకోవచ్చు కూడా. మణికట్టు వద్ద నాలుకను అద్ది, 5 నిమిషాల తర్వాత వాసన చూస్తే దుర్వాసన వస్తుందో లేదో తెలుస్తుంది. నాలుక మీద దూదిని అద్ది, ఆరిపోయాక వాసన చూడటంతోనూ గుర్తించొచ్చు. కావాలంటే కుటుంబ సభ్యులు, స్నేహితులకు దగ్గరగా ఉండి మాట్లాడటం ద్వారానూ తెలుసుకోవచ్చు.
ఇవీ చదవండి:
'తిండి + బద్ధకం = అధిక బరువు'... తగ్గాలంటే ఈ పద్ధతులు పాటించాల్సిందే!
రాత్రులు సరిగా నిద్ర పట్టడం లేదా..? ఈ నియమాలు పాటిస్తే చాలు..