Parenting Tips for Teenage Childrens : చిన్నతనంలో పిల్లలు అమ్మ కొంగు వదిలిపెట్టరు. నాన్న చేయిని వదిలి ఉండరు. ఆ వయస్సులో వారికి అమ్మానాన్న తప్ప, మరో లోకం కనిపించదు. పేరెంట్స్ ఏ విధంగా చెప్తే.. అలా నడుచుకుంటారు. కానీ, పెద్దవాళ్లయ్యే కొద్దీ "దూరం" పెరుగుతూ వస్తుంది. ఇక పిల్లలు టీనేజీలోకి ప్రవేశిస్తే.. పరిస్థితి మరింతగా క్లిష్టంగా మారిపోతుంది. వారి మంచి కోసం చెప్పినా.. ఆంక్షలు పెడుతున్నారనే ఫీలింగ్‌లోకి వెళ్లిపోతారు. ఒక దశలో తల్లిదండ్రులను శత్రువుల్లా కూడా ఫీలవుతారు. నేటితరంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. చిన్న చిన్న విషయాలకు కూడా పిల్లలు పేరెంట్స్‌తో గొడవపడుతున్నారు. అలాగని.. వాళ్లను వారి ఇష్టానికి వదిలేస్తే భవిష్యత్తు పాడయ్యే అవకాశాలూ లేకపోలేదు.
లెక్చర్లు ఇవ్వొద్దంటారు..
పిల్లలు టీనేజ్(Teenage)కు చేరుకోగానే తల్లిదండ్రులకు.. కొత్త కష్టం మొదలవుతుందని చెప్పవచ్చు. 14 ఏళ్లు వచ్చేసరికి వారిలో స్వతంత్ర భావాలు వస్తాయి. స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. దాంతో ఒక్కసారిగా స్వతంత్ర గానం వినిపిస్తారు. ధిక్కరించడం మొదలు పెడతారు. అనునిత్యం వారి భవిష్యత్తు గురించే ఆలోచించే తల్లిదండ్రులు.. పలాన విషయం మంచిదని చెప్పినా, చెడు గురించి హెచ్చరించినా.. ‘లెక్చర్లు వద్దు’ అంటూ మొహం మీదే అనేస్తారు. ఏది మంచో, ఏది చెడో ‘నాకు తెలుసు. నేను నిర్ణయించుకుంటాను’ అనే స్థాయికి చేరుకుంటారు.
పిల్లల తప్పు కాదు..
ఇలా ప్రవర్తించడం వాళ్ల తప్పు కాదు.. ఎదిగే క్రమంలో పిల్లల మెదడులో చకచకా జరిగిపోయే రసాయన చర్యల ప్రభావమది. హార్మోన్ల హార్మోనియం.. పాతవాటి పట్ల అయిష్టానికి.. కొత్తవాటి పట్ల ఆసక్తికి కారణమదే. ఈ సమయంలో పిల్లలకు తగినట్టు కన్నవారు మారకపోతే.. ఇంట్లో రణరంగమే జరుగుతుంది. ఇలాంటప్పుడే తల్లులు జాగ్రత్త వహించాలి. టీనేజీలో పిల్లలు((Parenting Tips) తమ చేతి నుంచి జారిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిండ్రులు ఏం చేయాలి? వారితో ఏ విధంగా వ్యవహరించాలంటే...?
కమ్యూనికేషన్..
టీనేజ్ పిల్లలు చెప్పేది ముందు శ్రద్ధగా వినాలి. అంతేగాని వారితో వాదనకు దిగి.. జడ్జిమెంట్ ఇవ్వొద్దు. వ్యాఖ్యానాలు చేయవద్దు. పిల్లల ప్రతి పాజిటివ్ ఆలోచనకూ మీ మద్దతు తెలపాలి. అదేవిధంగా ఏమైనా లోపాల గురిస్తే.. వాటిని సున్నితంగా చెప్పే ప్రయత్నం చేయాలి. అదీ నేరుగా కాకుండా.. ఉదాహరణల ద్వారా వారికి వివరించాలి.
ఆమోదించాలి..
ప్రతీ వ్యక్తి జీవితంలో టీనేజ్ అనేది తాత్కాలిక దశ మాత్రమే. చివరిదాకా ఈ విధంగానే ఉంటారని అనుకోకండి. ఈ క్లారిటీ పేరెంట్స్‌కు ఉండాలి. అన్నిటి కంటే ముందు వారు చెప్పే విషయాన్ని యథాతథంగా ఆమోదించాలి. అలాగే వారి కోపం, అసహనం.. కేవలం రసాయన చర్యల ఫలితమని మీరు గుర్తించాలి. అంతేగానీ వాటిని దయచేసి నెగెటివ్‌గా తీసుకోకండి. ఓపిగ్గా, చిరునవ్వుతో స్పందించండి.
ప్రేమ, డేటింగ్ గురించి మీ పిల్లలకు ఈ విషయాలు చెబుతున్నారా..?
గమనించాలి..
ఎప్పటికప్పుడు ఎదిగే పిల్లల ఇష్టాయిష్టాలను గమనించుకోగలిగితే చాలా సమస్యలకు చెక్‌పెట్టొచ్చు. ముఖ్యంగా టీనేజీలో.. మీ పిల్లల ఎంపికలను, సమీక్షలను, విమర్శలను పరిశీలనగా చూస్తూంటే.. వారి వ్యక్తిత్వాన్ని మీరు పసిగట్టేయగలరు. అప్పుడు ఏది మంచీ, ఏది చెడు అన్నది వారికి చెప్పగలరు.
వారికి అనుగుణంగా మారాలి..
ప్రతీ తల్లిదండ్రులు... తమ పిల్లలకోసమే జీవితాన్ని, కష్టాన్ని ధారపోస్తారు. అయితే.. మీరు చేసే ప్రతి పనిలో వారి ఇష్టాలూ ఇమిడి ఉండాలని మాత్రం మరిచిపోవద్దు. అప్పుడే.. వారు మీ త్యాగాన్ని, ఇబ్బందుల్ని అర్థం చేసుకుంటారు.
సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసుకోండి..
మీ పిల్లలు ఇష్టపడే సంగీతం, చదివే పుస్తకాలు, చూసే టీవీ షోలు, ఉపయోగించే యాప్స్.. ఇలాంటి వాటితో మీరూ పరిచయం పెంచుకోవాలి. ఎందుకంటే దీనివల్ల ఆ కౌమార దశలో ఉన్న పిల్లలతో మాట్లాడటానికి మీకు ఓ టాపిక్ దొరుకుతుంది. అప్పుడు మీ మధ్య బంధాన్ని బలోపేతం చేసుకోడానికి ఓ అవకాశమూ లభిస్తుంది. ఇది అత్యంత ముఖ్యమైనది.
ఈ టిప్స్ పాటిస్తూ.. టీనేజీలో ఉన్న మీ పిల్లలతో ప్రేమగా ఉన్నారంటే.. తప్పనిసరిగా వారిలో మార్పు గమనిస్తారు.
Parenting tips : ఈ చిన్న పనులే మిమ్మల్ని పిల్లలకు దగ్గర చేస్తాయి!
Parenting Tips: మీకు తెలుసా.. అమ్మాయిలకు ఇలాంటి సలహాలు ఇవ్వకూడదని!