వయసు, ఎత్తు, జెండర్.. మొదలైన అంశాలను బట్టి ప్రతి వ్యక్తీ ఇంత బరువుండాలని కొన్ని ప్రమాణాలుంటాయి. కానీ వివిధ కారణాల వల్ల సరైన బరువు ఉండకపోవచ్చు. ఉదాహరణకు సరైన పోషకాహారం తీసుకోకపోవడం, వేళాపాళాలేని భోజనం, శారీరక శ్రమకు సరిపడా ఆహారం తీసుకోకపోవడం, దీర్ఘకాలిక వ్యాధులు.. ఇలా నిర్ణీత బరువు లేకపోవడానికి చాలా కారణాలే ఉంటాయి.
వ్యాయామం..
ఈ క్రమంలో బరువు పెరగడానికైనా, తగ్గడానికైనా వ్యాయామం చేయడం తప్పనిసరి. వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల కండరాల బరువు పెరిగి తద్వారా శరీర బరువు పెరగొచ్చు. బరువు పెరగాలనుకునే వారికి ఈ ప్రక్రియ చాలా మంచిది. అయితే ఇది నిపుణుల పర్యవేక్షణలోనే జరగాలి.
మంచి ఆహారం..
బరువు పెరగాలి కదా.. అని ఏది పడితే అది తింటే అవసరమైన దానికంటే ఎక్కువ బరువు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సమతులాహారం తీసుకోవడం మంచిది. మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, కొవ్వులు.. మొదలైనవి శరీరానికి కావలసిన మొత్తంలో సమకూరేలా ఉండాలి. కండరాల బరువు పెరగడంలో ప్రొటీన్లు ముఖ్య పాత్ర వహిస్తాయి. తద్వారా శరీర బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
తినండి.. పెరగండి..
- శరీరానికి కావలసిన క్యాలరీలు మాంసాహారంలో అధిక మొత్తంలో ఉంటాయి. అలాగని రోజూ దీన్నే తింటే ఇందులో ఎక్కువగా ఉండే కొవ్వులు శరీరంలోకి చేరతాయి. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. కాబట్టి వారానికోసారో.. రెండుసార్లో తినాలి.
- శరీరానికి కావలసిన ప్రొటీన్లు, ఎ,డి,ఇ విటమిన్లు, కొవ్వులు.. మొదలైనవన్నీ ఉండే కోడిగుడ్లను ఆహారంలో భాగం చేసుకోండి.
- ఎప్పుడో జ్వరం వచ్చినప్పుడు తప్ప బ్రెడ్ జోలికి పోరు చాలామంది.. కానీ బరువు పెరగాలనుకునే వారు మాత్రం రోజూ దీన్నిఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రతి బ్రెడ్ స్త్లెస్‌లో 69 క్యాలరీలుంటాయి.
- మనం ఇంట్లో తయారు చేసుకునే పండ్ల రసాలు కూడా బరువు పెరగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. కాబట్టి బయట ఎక్కడో జ్యూస్ పాయింట్లలో తాగడం కంటే ఇంట్లోనే సహజంగా తయారు చేసుకునే పండ్ల రసాలే ఆరోగ్యానికి మంచివి.
- వెన్న తింటే బరువు పెరగొచ్చు. కానీ బరువు పెరగడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. కానీ రోజూ తింటే మాత్రం గుండెకు ప్రమాదం. కాబట్టి ప్రతి రోజూ కాకుండా వారానికి రెండు సార్లో.. మూడు సార్లో తినడం మంచిది.
- శరీరానికి కావలసిన క్యాలరీలు అధికంగా ఉండే పీనట్ బటర్, ఆలివ్ ఆయిల్, చీజ్.. మొదలైనవి తీసుకోవడం చాలా మంచిది.
- తక్షణ శక్తి కావాలంటే మాత్రం అరటి పండ్లు తినడమే ఏకైక మార్గం. ఒక్కో అరటి పండులో దాదాపు 100 క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే కార్బొహైడ్రేట్లు, పోషకాలు కూడా అరటి పండులో అధికంగా ఉంటాయి. కాబట్టి రోజుకో అరటి పండు తినడం అలవాటు చేసుకుంటే జీర్ణక్రియ సాఫీగా సాగడంతో పాటు తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంది.
- చేపల్లో ముఖ్యంగా ట్యూనా చేపలో శరీరానికి అవసరమైన కొవ్వులు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల మంచి శరీరాకృతినీ సొంతం చేసుకోవచ్చు.
- నట్స్, డ్రైఫ్రూట్స్‌లో క్యాలరీలు, ఫైబర్, ఇతర పోషకాలు కావాల్సినంత మొత్తంలో ఉంటాయి. కాబట్టి రోజూ బాదం, వాల్‌నట్స్, జీడిపప్పులు తింటే చాలు ఇట్టే బరువు పెరుగుతారు. ఒక కప్పు బాదం నుంచి 529 క్యాలరీలు అందితే.. కప్పు ఎండుద్రాక్షలో 449 క్యాలరీలుంటాయి. ప్రతి రోజూ వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయంలో పోషకాహార నిపుణులను సంప్రదించాలి.
- ఓట్‌మీల్.. ఇది బరువు తగ్గడానికి ఎంత ముఖ్యమో.. బరువు పెరగాలనుకునే వారికీ అంతే అవసరం. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచుపదార్థం త్వరగా బరువు పెరగడంలో తోడ్పడుతుంది.
- కొవ్వు లేని పెరుగును రోజూ తినడం వల్ల ఇట్టే బరువు పెరగొచ్చు. దీనిలో శరీరానికి అవసరమైన క్యాలరీలుంటాయి.
మితంగానే..
సులభంగా బరువు పెరగాలంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉండాలనుకుంటారు చాలామంది. కానీ అది నిజం కాదు.. బరువు పెరగాలనుకున్నా సరే మితంగానే ఆహారం తీసుకోవాలి. పోషక విలువలున్న పదార్థాలు, స్టార్చ్ ఎక్కువగా ఉండే దుంపలు.. మొదలైనవి తీసుకోవడం మంచిది. జంక్‌ఫుడ్ ఎంత ఎక్కువగా తింటే శరీరానికి కావలసిన పోషకాలు అంత ఎక్కువగా కోల్పోతున్నామని మాత్రం గుర్తుంచుకోండి. కాబట్టి మితంగా తినండి.. అవసరమైన మేర బరువు పెరగండి..