Insomnia symptoms : నేటి ఆధునిక కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. నిద్ర లేమి అంటే తగినంత నిద్ర లేకపోవడం లేదా నిద్ర పట్టకపోవడం. చాలా మంది వృత్తి రీత్యా కంప్యూటర్ల ముందు కూర్చుని గంటల తరబడి పని చేయడం, ఇంటికొచ్చాక సెల్ ఫోన్ వాడటం, టీవీ చూడటం వంటివి చేస్తారు. ఇవి మన కళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి సరైన నిద్ర ఉండదు.
కారణాలేంటి?
Insomnia causes : ఈ సమస్యకు ముఖ్యంగా కారణాలు మూడు నాలుగు రకాలుగా విభజించవచ్చు. అందులో మొట్ట మొదటిది మానసిక ఒత్తిడి, ఉద్వేగం. చాలా మందికి ఇదే ప్రధాన కారణం. వృత్తి రీత్యా కావచ్చు, వ్యక్తి గతంగా కావచ్చు.. అనేక మంది ఒత్తిడికి గురవుతారు. రెండోది జబ్బులు. వీటి వల్ల కొందరికి నిద్ర ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. ఉదాహరణకు థైరాయిడ్ జబ్బుల కోసం వాడే మందులు మూడో కారణంగా చెప్పవచ్చు. జీవన శైలి నాలుగో కారణం. కొందరు ఉద్యోగాల్లో షిఫ్టుల పరంగా పని చేస్తారు. ఇది కూడా నిద్ర లేమికి ముఖ్య కారణం.
పరిష్కార మార్గాలు :
Insomnia treatment : నిద్రలేమికి కారణాలేంటో తెలుసుకుని సరైన చికిత్స తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. ఇలా కాకుండా సాధారణంగా నిద్ర పట్టడానికి పలు సూచనలు పాటించాలి. అవి
- ఒకే సమయానికి నిద్ర పోవడం, నిద్ర లేవటం చేయాలి.
- రాత్రి ఆలస్యంగా, పగటి పూట పడుకోకూడదు.
- నిద్రకు ఉపక్రమించే గంటన్నర ముందు అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండటం.
- బెడ్ రూంలో తక్కువ లైటింగ్ పెట్టుకోవడం
- టీ, కాఫీ, సిగరెట్లు తాగటం తగ్గించాలి.
- రోజూ వ్యాయామం చేయాలి.
- మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయాలి.
డయాబెటివ్ మందుల వల్ల నిద్రలేమి సమస్య వస్తుందా..?
డయాబెటిస్ మందులు వాడటం వల్ల నిద్రలేమి సమస్య రావటం అనేది చాలా అరుదు. రాత్రి పూట షుగర్ డౌన్ అవటం వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది. బాగా నీరసంగా ఉండటం, చల్లటి చెమటలు పెట్టడం, ఆకలి లాంటి లక్షణాలు ఉండి నిద్ర సరిగా పట్టకపోతే.. తెల్లవారుజామున రెండింటికి లేచి షుగర్ చెక్ చేసుకోవాలి. ఆ సమయంలో షుగర్ తక్కువగా ఉంటే షుగర్ టాబ్లెట్స్ వల్ల నిద్రలేమి సమస్య ఉన్నట్లు. జనరల్‌గా వాడే మందుల్లో నిద్రను తగ్గించే గుణం చాలా తక్కువగా ఉంటుంది. మీకు అనుమానం ఉంటే వైద్యుల్ని సంప్రదించి, మీరు వాడుతున్న మందుల్ని చూపించి.. వారి సలహాలు, సూచనల ప్రకారం ముందుకెళ్లండి.