Hair Growth Tips: జుట్టు పెరగటానికి ప్రత్యేకించి ఆహారమేదీ ఉండకపోవచ్చు. కానీ కొన్ని పోషకాలు వెంట్రుకలకు మేలు చేస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇవి లభించే పదార్థాలను తెలుసుకొని, ఆహారంలో భాగం చేసుకోవటం ఎంతైనా మంచిది.
నిగనిగకు చేపలు
ఒమేగా3 కొవ్వు ఆమ్లాలను మన శరీరం తయారుచేసుకోలేదు. వీటిని ఆహారం లేదా మాత్రల రూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి జబ్బులు రాకుండా కాపాడటమే కాదు.. జుట్టు పెరగటానికి, నిగనిగలాడటానికీ అవసరమే. సాల్మన్, సార్‌డైన్, మాకెరల్ వంటి చేపల్లో ఇవి దండిగా ఉంటాయి.
పెరగటానికి పెరుగు
వెంట్రుకల ఆరోగ్యానికి ప్రొటీన్ అత్యవసరం. ఇది పెరుగులో దండిగా ఉంటుంది. అంతేకాదు.. మాడుకు రక్త సరఫరా మెరుగుపడటానికి, వెంట్రుకలు పెరగటానికి తోడ్పడే విటమిన్ బి5 (పాంటోథెనిక్ యాసిడ్) కూడా ఉంటుంది. ఇది వెంట్రుకలు పలుచబడకుండా, ఊడిపోకుండా కాపాడుతుంది.
దృఢత్వానికి పాలకూర
చాలా ఆకుకూరల్లో మాదిరిగానే పాలకూరలోనూ బోలెడన్ని పోషకాలుంటాయి. విటమిన్ ఎ దండిగా ఉంటుంది. ఐరన్, బీటా కెరొటిన్, ఫోలేట్, విటమిన్ సి సైతం ఉంటాయి. ఇవన్నీ కలిసి మాడు ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తాయి. వెంట్రుకలు పెళుసుబారకుండా, చిట్లిపోకుండా కాపాడతాయి.
చిట్లకుండా జామ
జామపండ్లలో విటమిన్ సి దండిగా ఉంటుంది. వెంట్రుకలు చిట్లకుండా, విరిగిపోకుండా చూడటానికిది తోడ్పడుతుంది. ఒక కప్పు జామ పండ్ల ముక్కలతో 377 మి.గ్రా. విటమిన్ సి లభిస్తుంది. ఇది మన రోజువారీ అవసరాల కన్నా నాలుగు రెట్లు ఎక్కువ!
రక్త ప్రసరణకు దాల్చిన చెక్క
దాల్చిన చెక్క రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్, పోషకాలు ఎక్కువగా అందుతాయి. ఫలితంగా జట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
ఊడకుండా ఐరన్
తగినంత ఐరన్ తీసుకోకపోయినా జుట్టు ఊడిపోవచ్చు. మాంసాహారంలో.. ముఖ్యంగా కాలేయం వంటి అవయవాల్లో ఐరన్ దండిగా ఉంటుంది. ఆకు కూరలతోనూ లభిస్తుంది. ప్రస్తుతం ఐరన్‌ను కలిపిన పదార్థాలూ అందుబాటులో ఉంటున్నాయి.
పొడిబారకుండా చిలగడ దుంపలు
చిలగడ దుంపల్లో బీటా కెరొటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. దీన్ని మన శరీరం విటమిన్ ఎగా మార్చుకుంటుంది. ఇది జట్టు పొడిబారటాన్ని అరికడుతుంది. నిగనిగలాడినట్టు కనిపించేలా చేస్తుంది. క్యారెట్, గుమ్మడి, మామిడిపండ్లతోనూ బీటా కెరొటిన్ లభిస్తుంది.
దట్టానికి చికెన్, గుడ్లు
వెంట్రుకలన్నీ ఎప్పుడూ ఒకేలా పెరగవు. కొంతకాలం విశ్రాంతి దశలో ఉంటాయి. తగినంత ప్రొటీన్ అందకపోతే వెంట్రుకలు ఈ దశలోనే ఉంటాయి. అదే సమయంలో పాత వెంట్రుకలు రాలిపోతుంటాయి. మాంసంలో ప్రొటీన్ ఉంటుంది కానీ సంతృప్తకొవ్వు ఎక్కువ. అదే చికెన్‌తో తక్కువ సంతృప్తకొవ్వుతోనే మంచి ప్రొటీన్ లభిస్తుంది. ఇక గుడ్లలోని బయోటిన్ వెంట్రుకలు పెరగటానికి తోడ్పడుతుంది.
ఇదీ చదవండి:
ఇలా చేస్తే డైటింగ్ చేయకుండానే బరువు తగ్గొచ్చు!
Post TB treatment side effects: క్షయ తగ్గినా.. దగ్గు, కళ్లె పడుతుందా? కారణాలివే..!