Fruit peel benefits : బంగాళాదుంప పొట్టు తీస్తాం. దోసకాయ చెక్కు తీస్తాం. అరటి పండు, యాపిల్, నారింజ.. ఇలా ఎన్నో పండ్లు పొట్టు తీసే తింటాం. రుచిగా ఉండదనో, తినటానికి కష్టమనో, సరిగా జీర్ణం కాదనో, పురుగుమందుల అవశేషాలుంటాయనో మనలో చాలామంది చేసే పనే ఇది. మరో ఆలోచన లేకుండా పొట్టు తీసేసి అవతల పారేస్తుంటాం. నిజానికి పోషకాలను పారేస్తున్నామని అనుకోం. అవును. కూరగాయలు, పండ్లతో లభించే విటమిన్లు, ఖనిజాల వంటి పోషకాల్లో 25-30% పొట్టు, తొక్కల్లోనే ఉంటాయి! పీచు కూడా దండిగానే ఉంటుంది. కూరగాయలతో లభించే మొత్తం పీచులో 31% వీటి పొట్టులోనే ఉంటుంది.
Vegetable peel benefits in telugu : పీచుతో ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇలా ఆకలిని తగ్గిస్తుంది. అంటే బరువు తగ్గటానికీ తోడ్పడుతుందన్నమాట. అంతేకాదు, పీచుతో జీర్ణకోశ వ్యవస్థ సైతం మెరుగవుతుంది. దీంతో మలబద్ధకం తగ్గుతుంది. ఇక యాంటీఆక్సిడెంట్ల విషయానికి వస్తే కండలో కన్నా పొట్టులోనే వీటి మోతాదులు 328 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీలైనంతవరకు పొట్టు తీయకుండానే పండ్లు, కూరగాయలు తినాలన్నది నిపుణుల సలహా. మరి వేటి పొట్టులో ఏ గుట్టు దాగుందో చూద్దాం.
బంగాళాదుంప
ముందూ వెనకా చూడకుండా పొట్టు తీసేయటంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బంగాళాదుంప గురించే. కుర్మా అయినా కూర అయినా పొట్టు తీస్తుంటారు. కానీ దీని లోపల కన్నా పొట్టులోనే ఎక్కువ పోషకాలుంటాయి. పొట్టు తీసి ఉడికించిన దాని కన్నా పొట్టుతీయకుండా ఉడికించిన బంగాళాదుంపలో విటమిన్ సి 175%, పొటాషియం 115%, ఫోలేట్ 111%, మెగ్నీషియం, ఫాస్ఫరస్ 110% అధికంగా ఉంటాయి.
పుచ్చకాయ
దీని తొక్కలో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లముంటుంది. ఇది రక్తంలోంచి నైట్రోజన్ తొలగిపోవటానికి తోడ్పడుతుంది. కండరాల నొప్పులు తగ్గటానికీ దోహదం చేస్తుంది. పుచ్చకాయ గుజ్జులో కన్నా తొక్కలోనే సిట్రులిన్ పెద్దమొత్తంలో ఉంటుంది. తొక్కను పచ్చిగా తినటం ఇష్టపడకపోతే రసం తీసి తాగొచ్చు. కూరగాయల మాదిరిగా వేయించుకొని తినొచ్చు. కావాలంటే పచ్చడీ చేసుకోవచ్చు.
యాపిల్
apple peel benefits for weight loss : పొట్టుతో కూడిన యాపిల్‌లో విటమిన్ కె 332%, విటమిన్ ఎ 142%, విటమిన్ సి 115%, క్యాల్షియం 20%, పొటాషియం 19% ఎక్కువగా ఉంటుంది. పీచూ ఎక్కువే. ఇందులో క్వెర్‌సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఇది మెదడు, ఊపిరితిత్తులు మరింత బాగా పనిచేయటానికి తోడ్పడుతుంది.
కీర దోస
సలాడ్‌గానే కాదు, విడిగా ముక్కలుగా తినటానికీ కీర దోస బాగుంటుంది. దీన్ని పొట్టుతో తింటేనే మరింత లాభం. ముదురు ఆకుపచ్చ తొక్కలోనే పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఎముకలు బలంగా ఉండటానికి, రక్తం గడ్డలు ఏర్పడకుండా చూడటానికి తోడ్పడే విటమిన్ కె సైతం దండిగానే ఉంటుంది. పెరటి తోటలో పండించిన కీర దోసకాయలైతే శుభ్రంగా కడిగితే చాలు. పొట్టుతోనే లాగించేయొచ్చు.
మామిడి
దీన్ని చూస్తే నోరూరనిది ఎవరికి? తొక్క రంగుతోనే అంతలా ఆకర్షిస్తుంది. మగ్గించటానికి రసాయనాలు వాడుతుండటం వల్ల చాలామంది తొక్క తినటానికి సందేహిస్తుంటారు. అయితే తోటలో పండించినవి, సహజంగా మగ్గినవైతే తొక్కతో తినటమే మంచిది. ఇందులో బోలెడంత పీచు ఉంటుంది. విటమిన్ ఇ, సి, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, కెరొటినాయిడ్లూ ఎక్కువే. అంతేకాదు.. ఒమేగా 3, ఒమేగా 6.. రెండు రకాల పాలీఅన్‌సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలూ ఉంటాయి.
నారింజ
దీని లోపలి కన్నా తొక్కలో విటమిన్ సి రెండితలు ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి6, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, రైబోఫ్లావిన్ వంటి పోషకాలూ ఎక్కువగానే ఉంటాయి. నారింజ తొక్క త్వరగా జీర్ణం కాదు. చేదుగానూ ఉంటుంది. కాబట్టి కొబ్బరి మాదిరిగా కోరుకొని సలాడ్ల మీద చల్లుకోవచ్చు. ఐస్‌క్రీమ్, చాక్లెట్లతోనూ ఇది బాగా ఇమిడిపోతుంది.
వంకాయ
కొన్నిచోట్ల పెద్ద పెద్ద వంకాయలను పొట్టు తీసేసి వాడుతుంటారు. అలా చేస్తే యాంటీఆక్సిడెంట్లను కోల్పోయినట్టే. ముదురురంగు వంకాయల్లో యాంటీఆక్సిడెంట్లు మరింత ఎక్కువగా ఉంటాయి. వంకాయ పొట్టులోని నాసునిన్ అనే యాంతోసయానిన్ విశృంఖల కణాల దాడితో మెదడు కణాల పైపొర దెబ్బతినకుండా కాపాడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కణాల లోపలికి పోషకాలు వెళ్లేలా, లోపల్నుంచి వ్యర్థాలు బయటకు వచ్చేలా కూడా చూస్తుంది.
అరటి
banana peel benefits : ఏమిటీ? అరటి పండు కూడా తొక్కతోనే తినాలా? అని అడుగుతారేమో. ఆశ్చర్యంగా అనిపించినా దీని తొక్కలోనే పొటాషియం, యాంటీఆక్సిడెంట్ల వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ల్యూటీన్ అనే యాంటీఆక్సిడెంట్ కంటికి ఎంతో మేలు చేస్తుంది. అరటి తొక్కలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లమూ ఉంటుంది. ఇది ప్రొటీన్లు, కండరాలు, ఎంజైమ్‌లు, నాడీ సమాచార వాహకాల ఉత్పత్తి, నియత్రణకు తోడ్పడుతుంది. కాస్త మందంగా, చేదుగా ఉండటం వల్ల అరటి తొక్క తినటానికి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. కాసేపు ఉడికించి, ఓవెన్‌లో వేడి చేస్తే పొడిగా తయారవుతుంది. తర్వాత ఇష్టాన్ని బట్టి వాడుకోవచ్చు. బాగా మగ్గిన అరటిపండు తొక్క పలుచగానే ఉంటుంది. దీన్ని పండుతో తిన్నా పెద్దగా ఇబ్బందేమీ ఉండదు.
కివీ
గట్టిగా, నూగుతో కూడినట్టు కాస్త ఎబ్బెట్టుగా కనిపించినా కివీని తొక్కతో సహా తినటానికి సందేహించాల్సిన పనిలేదు. నూగును గీకేసి పొట్టుతోనే తినేయొచ్చు. దీంతో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా లభించేలా చూసుకోవచ్చు.