బరువు తగ్గడం ద్వారా మధుమేహాన్ని అడ్డుకోవచ్చని చెబుతున్నారు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధకులు. కుటుంబీకుల్లో మధుమేహం ఉండి, బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్‌ఐ) ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నవాళ్లలో మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ అని వాళ్ల పరిశీలనలో స్పష్టమైంది.
అనువంశికంగా ఉన్నప్పుడు బీఎమ్‌ఐ తక్కువగా ఉన్నవాళ్లకీ రావచ్చు, కానీ బరువున్నవాళ్లతో పోలిస్తే వీళ్ల శాతం తక్కువట. అదీ కొద్దిగా బరువు పెరిగి, మళ్లీ మామూలైపోయేవాళ్లకన్నా దీర్ఘకాలంపాటు అధిక బరువుతో ఉండేవాళ్లలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందట. దీన్నిబట్టి జన్యువులకన్నా బరువు వల్లే ఎక్కువమంది మధుమేహానికి గురవుతున్నారట. సో, ఆనువంశికంగా మధుమేహం వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎప్పటికప్పడు బరువునీ మధుమేహాన్నీ పరిశీలించుకోవాలి. మధుమేహాన్ని తొలిదశలోనే గుర్తించి, బరువు తగ్గితే అది కూడా తగ్గుతుందట.