Cow And Buffalo Milk Difference : చాలా మందికి రోజూ పాలు తాగే అలవాటు ఉంటుంది. పాలు తాగడం అనేది మంచి అలవాటు కూడా, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆరోగ్యం కోసం గ్లాసుడు పాలు తాగుతుంటారు. పాలు తాగడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పాలలో కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ప్రతి రోజు గ్లాసు పాలు తీసుకోవడం వల్ల శరీర శ్రేయస్సు మెరుగవుతుంది. మెదడు పనితీరులో చురుకుదనం వస్తుంది. శక్తి కూడా పెరుగుతుంది. అయితే కొంత మంది బరువును కంట్రోల్ చేయడానికి కూడా పాలు తాగుతుంటారు. ఇలాంటి వారు ఏ పాలు తాగితే మంచిదో తెలుసుకోవాలి.
మనకు ఆవు, గేదె పాలు లభిస్తాయి. ఈ పాలలో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేక లక్షణం ఉంది. అందువల్ల ఏ పాలు తాగుతున్నారో ముందుగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పాలు తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. పాలు తాగడం వల్ల ఆకలి అనే అనుభూతిని తగ్గిస్తుంది. పెఫైడ్ వైవై హర్మోన్ కారణంగా ఎక్కువ సేపు సంతృప్తి ఉంటుంది. పాలలో కాల్షియం సంపూర్ణంగా ఉండటం వల్ల జీవక్రియను ప్రోత్సహిస్తుంది. ఇవి చివరికి బరువును తగ్గించేందుకు సహాయపడుతుంది.
ఆవు, గేదె పాల మధ్య వ్యత్యాసం
ఆవు, గేదె పాల మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఎక్కువ మంది పిల్లలకు ఆవు పాలు పట్టేందుకు మొగ్గుచూపుతారు. కాస్త పెద్దవారు అయ్యాకే గేదె పాలు పడుతుంటారు. దీనికి కారణం ఆవు పాలలో తక్కువ కంటెంట్ కొవ్వు కలిగి ఉంటాయి. తేలికగా జీర్ణమవుతాయి. ఆవు పాలతో పోల్చితే గేదె పాలు చిక్కగా ఉంటాయి. ప్రొటీన్ కంటెంట్ విషయానికి వస్తే ఆవు పాలు కంటే గేదె పాలలో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. అయితే గేదె పాలతో పోలిస్తే ఆవు పాలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆవు పాలు పలుచగా ఉంటాయి. అందువల్ల ఆవు పాలు సులభంగా జీర్ణమవుతాయని చెబుతున్నారు నిపుణులు.
పిల్లలకు ఆవు పాలు పట్టడానికి ప్రధాన కారణం కూడా సులభంగా జీర్ణమయ్యే అవకాశం ఉండటమే. నిపుణుల అధ్యయనాల ప్రకారం గ్లాసుడు గేదె పాలలో 100 కేలరీలు ఉంటాయి. అదే గ్లాసుడు ఆవు పాలలో 65 నుంచి 70 కేలరీలు మాత్రమే లభిస్తాయి. ఇవి కాకుండా ఆవు పాలలో సల్ఫర్ ఉంటుంది. ఇది మెదడు అభివృద్ధికి మూలకంగా పనిచేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. దీని నుంచి విటమిన్ ఏ ఉత్పత్తి అవుతుంది. బీటా కెరోటిన్ గేదె పాలలో ఉండదని చెబుతున్నారు నిపుణులు.
బరువు తగ్గడానికి ఏ పాలు ఉత్తమం?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆవు పాల కంటే గేదె పాలలో పోషకాలు, కేలరీల పరిణామం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఆవు పాలలో తక్కువ కొవ్వు ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ హైడ్రేటింగ్, పల్చగా ఉంటాయి. గేదె పాలలో అధిక కొవ్వు ఉంటుంది. 100 మిల్లీలీటర్ల గేదె పాలలో 8 గ్రాముల కొవ్వు ఉంటే, 100 మిల్లీలీటర్ల ఆవు పాలలో కేవలం 4 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం పూర్తి కొవ్వు పాలు తీసుకోవడం తక్కువ శరీర బరువుతో ముడిపడి ఉందని చెబుతున్నారు. కొంతమంది పాలు తాగడం వల్ల సాధారణంగా బరువు పెరగడాన్ని నిరోధిస్తుందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.