కొవిడ్-19 అనగానే జ్వరం, దగ్గు వంటి శ్వాసకోశ లక్షణాలే గుర్తుకొస్తుంటాయి. ముఖ్యమైనవి ఇవే అయినా వాంతి, విరేచనాల వంటి జీర్ణకోశ లక్షణాలపై చిన్న చూపు తగదు. కొందరిలో జ్వరం, దగ్గు కన్నా ఇవే ముందు కనిపిస్తున్నాయి! కొందరిలో కేవలం విరేచనాలే ఉంటున్నాయి. వీటిని మామూలు వాంతులు, విరేచనాలుగా భావిస్తుండటంతో కరోనా పరీక్ష చేయించుకోవటమూ ఆలస్యమవుతోంది. ఇందువల్ల జబ్బు తీవ్రమయ్యాక గానీ చికిత్స పొందటం లేదు.
మరోవైపు- జీర్ణ సమస్యలు గలవారిలో కొవిడ్ ఉద్ధృతంగానూ మారుతోంది. ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తోంది. కరోనా తీవ్రమవుతున్నకొద్దీ జీర్ణ సమస్యలూ ప్రమాదకరంగానూ పరిణమిస్తుండటం గమనార్హం. మరణించే ముప్పూ ఎక్కువవుతోంది. అందువల్ల జీర్ణకోశ సమస్యల మీద ప్రత్యేక దృష్టి అత్యవసరం.
విరేచనాలతో బాధపడుతుంటే.. ముఖ్యంగా కొవిడ్ బారినపడ్డవారికి సన్నిహితంగా మెలిగితే తప్పకుండా కరోనాను అనుమానించాల్సిందే. కలుషితాహారం తినటం, కలుషిత నీరు తాగటం వంటి ఇతరత్రా కారణాలేవీ లేకుండా వాంతులు, విరేచనాలు మొదలైతే కరోనా పరీక్ష చేయించుకోవటం మంచిది. ఫలితాలు వచ్చేంతవరకు ఇంట్లో విడిగానే ఉండాలి.
ఎందుకిలా?
కరోనా జబ్బు కారక వైరస్ (సార్స్-కోవ్2) యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్2 (ఏస్2) గ్రాహకాలు, టీఎంపీఆర్‌ఎస్‌ఎస్ ఎంజైమ్ సాయంతో శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి, అక్కడ్నుంచి ఇతరత్రా భాగాలకు విస్తరిస్తుందని మొదట్లో అనుకునేవారు. కానీ ఏస్2 గ్రాహకాలు, టీఎంపీఆర్‌ఎస్‌ఎస్ ఎంజైమ్‌లు గల శరీర భాగాల్లో ఎక్కడ్నుంచైనా వైరస్ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. ఇవి నోరు, ముక్కు, ఊపిరితిత్తుల్లోనే కాదు.. అన్నవాహిక, చిన్నపేగులు, పెద్దపేగుల్లోనూ పెద్దమొత్తంలో ఉంటాయి. శ్వాసకోశంలో కన్నా జీర్ణ వ్యవస్థలో ఏస్2 గ్రాహకాలు వంద రెట్లు ఎక్కువ. పేగుల్లోకి వైరస్ వెళ్లాలంటే జీర్ణాశయాన్ని దాటుకొనే వెళ్లాలి కదా. జీర్ణాశయంలో ఆమ్లం ప్రభావాన్ని ఇదెలా తట్టుకుంటుంది? నిజానికి జీర్ణాశయ ఆమ్లం చాలా శక్తిమంతమైంది. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములను ఇట్టే చంపేస్తుంది. కరోనా వైరస్ ఇక్కడే తెలివిగా ప్రవరిస్తోంది. ఆహార పదార్థాల మాటున దాక్కొని ఆమ్లం ప్రభావం నుంచి తప్పించుకుంటోంది! ఆహార పదార్థాలతో కలిసిపోయినప్పుడు వైరస్ మీద ఆమ్లం ప్రభావం అంతగా ఉండదు. పైగా దీనిపై కొవ్వు పొర ఉంటుంది. దీన్ని ఆమ్లం కన్నా ఆల్కహాల్ బాగా విచ్ఛిన్నం చేస్తుంది. ఇలా కరోనా వైరస్ జీర్ణాశయాన్ని దాటుకొని చిన్నపేగులు, పెద్ద పేగుల్లోకి చేరుకొని అంటుకుపోతోంది. ఏస్2 గ్రాహకాలు, టీఎంపీఆర్‌ఎస్‌ఎస్ ఎంజైమ్ సాయంతో కణాల్లోకి చొచ్చుకుపోతోంది. ఇదే జీర్ణ సమస్యలకు దారితీస్తోంది.
సమస్యలు- రకరకాలు
- విరేచనాలు, వాంతులు
కొవిడ్-19 జీర్ణ సమస్యల్లో ప్రధానమైనవి, సుమారు 20% మందిలో కనిపిస్తున్నవి వాంతులు, విరేచనాలే. వీటికి మూలం పేగుల్లో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) తలెత్తటం. ఇవి ఒకట్రెండు రోజుల్లోనే తగ్గిపోవచ్చు గానీ కొందరిలో విడవకుండా వేధించొచ్ఛు రెండు, మూడు వారాలైనా తగ్గకపోతే సమస్య శ్రుతి మించుతోందనే అర్థం. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. ద్రవాలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తినాలి. 24 గంటల తర్వాతా లక్షణాలు తగ్గకపోయినా.. జ్వరం, కడుపునొప్పి తీవ్రం అవుతున్నా, వాంతిలో రక్తం చారికలు కనిపించినా తాత్సారం చేయరాదు. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. నీటి శాతం తగ్గుతున్నట్టు గమనిస్తే సెలైన్ పెట్టాల్సి ఉంటుంది. రక్తం గడ్డలు ఏర్పడకుండా ప్లెక్సిన్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి రావొచ్ఛు కొవిడ్ తగ్గిన తర్వాతా కొద్దిరోజుల వరకూ విరేచనాలు కొనసాగొచ్ఛు.
గమనించాల్సిన విషయం ఏంటంటే- కరోనా వైరస్ మలంలో ఎక్కువ కాలం ఉండిపోవటం. ముక్కులోనైతే రెండు వారాల్లోనే పోతోంది గానీ మలంలో ఆరు వారాల వరకూ ఉంటోంది. ఆర్‌టీపీసీఆర్ పరీక్షలో వైరస్ లేకపోయినా మలంలో కనిపిస్తోంది. ఇది వేరేవాళ్లకు సోకుతుందా? జబ్బు కలగజేస్తుందా? అనేవి కచ్చితంగా నిర్ధారణ కాకపోయినా తగు జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. మలంలోని వైరస్ చేతులకు అంటుకొని, అక్కడ్నుంచి నోటిలోకి చేరే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల మాస్కు ధరించటం, ఇతరులకు దూరంగా ఉండటం, చేతులను సబ్బుతో కడుక్కోవటం వంటి వాటికి తోడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టాయ్‌లెట్ మూత వేసిన తర్వాతే ఫ్లష్ చేయాలి. టాయ్‌లెట్ బటన్లను, గచ్చును, తలుపు గొళ్లెం, పిడి వంటి వాటినీ తరచూ సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలి.
- కడుపునొప్పి
దీనికి మూలం చిన్నపేగులకు రక్త సరఫరా తగ్గిపోవటం. కరోనా వైరస్ రక్తనాళాల్లో రక్తం గూడు కట్టేలా చేస్తోంది. పేగులకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఇలాంటిది తలెత్తితే కడుపు నొప్పి రావొచ్ఛు దీన్ని నిర్లక్ష్యం చేయటానికి లేదు. నొప్పి ఏమాత్రం తగ్గకుండా క్షణక్షణానికీ ఎక్కువవుతూ వస్తుంటే అసలే తాత్సారం చేయరాదు. దీనికి సత్వర చికిత్స అవసరం. పేగులకు రక్త సరఫరా తగ్గినట్టు అనుమానిస్తే వెంటనే సీటీ యాంజియో చేయాల్సి ఉంటుంది. రక్త సరఫరా తగ్గితే ఇందులో బయటపడుతుంది. వీరికి రక్తాన్ని పలుచగా చేసే ఇంజెక్షన్లు బాగా ఉపయోగపడతాయి. దీంతో రక్తం గూడు కట్టటం తగ్గుతుంది. రక్తాన్ని పలుచగా చేసే మందుల విషయంలో జాగ్రత్త అవసరం. వీటితో పాటు రక్తం గడ్డకుండా చూసే కొపిడెగ్రెల్, ఆస్ప్రిన్ వంటి మందులూ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి పేగుల్లో రక్తస్రావం జరగకుండా కాపాడతాయి.
- కడుపుబ్బరం
కొవిడ్-19తో బాధపడుతున్నప్పుడే కాదు, తగ్గిన తర్వాతా చాలామంది కడుపుబ్బరంతో బాధపడుతున్నారు. దీనికి కారణం పేగుల్లోని బ్యాక్టీరియా తీరుతెన్నులు అస్తవ్యస్తం కావటం. మన పేగుల్లో రకరకాల బ్యాక్టీరియా ఉంటుంది. కరోనా జబ్బులో వీటి సమతుల్యత దెబ్బతింటోంది. మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువవుతోంది. ఇది గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి కావటానికి, కడుపుబ్బరానికి దారితీస్తుంది. కరోనా తగ్గిన తర్వాతా ఇది 2-3 నెలల పాటు వేధిస్తోంది.
కడుపుబ్బరంతో బాధపడేవారు గోధుమ పదార్థాలు, పాలు తీసుకోకపోవటం మంచిది. పెరుగు, మజ్జిగ తీసుకోవాలి. వ్యాయామం చేయటం ముఖ్యం. వ్యాయామంతో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అలాగే మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే ప్రొబయోటిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
- కాలేయ జబ్బులు
కరోనా వైరస్ మూలంగా కాలేయంలోనూ చాలా మార్పులు కనిపిస్తున్నాయి. కాలేయంలో హెపటోసైట్స్, కొలాంజియోసైట్స్.. అని రెండు రకాల కణాలుంటాయి. కాలేయం గొట్టాల్లోని కొలాంజియోసైట్ల మీద ఏస్2 గ్రాహకాలు చాలా ఎక్కువ. కాబట్టే కొవిడ్ బారినపడ్డ మూడింట ఒక వంతు మందిలో కాలేయం ప్రభావితం అవుతోంది. దీంతో ఏస్‌జీవోటీ, ఎస్‌జీపీటీ ఎంజైమ్‌ల స్థాయులు బాగా పెరుగుతున్నాయి. కొవిడ్ బారినపడ్డ దాదాపు 50% మందిలో వీటి స్థాయులు ఎక్కువవుతుండటం గమనార్హం. అరుదుగా కొందరికి కాలేయం పూర్తిగా విఫలమయ్యే స్థితికీ చేరుకుంటోంది.
అప్పటికే కాలేయానికి కొవ్వు పట్టటం (ఫ్యాటీ లివర్), కాలేయం గట్టి పడటం (లివర్ సిరోసిస్) వంటి జబ్బులతో బాధపడుతున్నవారికి కరోనా మరింత ప్రమాదకరంగానూ పరిణమిస్తోంది. కాలేయం గట్టిపడిన వారిలో రోగనిరోధకశక్తి తక్కువ. దీంతో కొవిడ్ సోకే అవకాశం ఎక్కువ. జబ్బు తీవ్రతా ఎక్కువే. అందువల్ల దీర్ఘకాలంగా కాలేయ జబ్బులు గలవారు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. బయటకు వెళ్తే మాస్కు ధరించాలి. వీలైనంతవరకు ఫోన్, వీడియో ద్వారా డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైతేనే.. అదీ ఇంటికి దగ్గర్లోని ల్యాబులో పరీక్షలు చేయించుకోవాలి.
పేగుల్లో చికాకు (ఇరిటబుల్ బవల్ డిసీజ్- ఐబీడీ) బాధితులు స్టిరాయిడ్లు తీసుకుంటుంటారు. వీటిని 40 మి.గ్రా. కన్నా ఎక్కువ మోతాదులో తీసుకుంటుంటే సగానికి తగ్గించెయ్యాలి. కొవిడ్ ఉద్ధృతి తగ్గేంతవరకు పూర్తిగా ఆపేసినా మంచిదే. ఐబీడీ తగ్గటానికి బయోలాజికల్స్ మందులు బాగా ఉపయోగపడతాయి. ఇవి ఒంట్లో వాపు ప్రక్రియను తగ్గిస్తాయి. కాకపోతే వీటితో క్షయ వంటి ఇన్‌ఫెక్షన్లు ఎక్కువవతాయి. కానీ బయోలాజికల్స్ వేసుకునే ఐబీడీ బాధితులకు కరోనా ముప్పు తక్కువగా ఉంటుండటం విశేషం. వీరిలో జబ్బు తీవ్రతా తక్కువగానే ఉంటోంది.
- క్లోమగ్రంథి వాపు
అరుదుగా కొందరికి క్లోమగ్రంథి (పాంక్రియాస్) వాపు తలెత్తటమూ కనిపిస్తోంది. ఎంజైమ్‌ల ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోవటం దీనికి కారణం. పాంక్రియాస్‌లోని ఐలెట్ కణాల్లోనూ ఏస్2 గ్రాహకాలుంటాయి. అందుకే సార్స్-కోవ్2 క్లోమం మీదా తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మధుమేహం మరింత ఎక్కువవుతోంది. పాంక్రియాస్ వాపు త్వరగా తగ్గుతున్నప్పటికీ మధుమేహం అంతగా నియంత్రణలోకి రావటం లేదు. దీన్ని నిశితంగా గమనిస్తూ.. ఇన్సులిన్ ఇస్తూ చికిత్స చేయాల్సి ఉంటుంది.
- ఫామోసిడ్ రక్ష
కారణమేంటో తెలియదు గానీ జీర్ణకోశ పుండ్లకు (అల్సర్) వాడే ఫామోసిడ్ మందు వేసుకునేవారికి కరోనా ముప్పు తక్కువగా ఉంటోంది! అందుకే ప్రస్తుతం అల్సర్ బాధితులకు ఒమిప్రొజోల్ వంటి పీపీఈ రకం మందులకు బదులు దీన్నే ఇస్తున్నారు. కరోనా బాధితులకు చికిత్స, సేవలు చేసే వైద్య సిబ్బంది కొవిడ్-19 నివారణకు ఫామోసిడ్‌ను వాడుకోవచ్ఛు చికిత్సలోనూ ఇతర మందులతో పాటు దీన్ని కూడా ఇస్తున్నారు.
కరోనా తగ్గాకా..
- కరోనా జబ్బు తగ్గిన తర్వాతా జీర్ణకోశంపై దాని దుష్ప్రభావాలు వెంటాడుతూ వస్తుంటాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
- అన్ని పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలి.
- విటమిన్ సి, విటమిన్ డి, జింక్ తీసుకోవాలి.
- బ్యాక్టీరియా తిరిగి పుంజుకోవటానికి 2-3 వారాలు పడుతుంది. అందువల్ల బయటి ఆహారం తినొద్ధు ఇంట్లో వండిన ఆహారం తినటమే మేలు.
- నాలుగు వారాల వరకు మద్యం పూర్తిగా మానెయ్యాలి. ఆల్కహాల్‌తో వైరస్ చనిపోతుందని, లోపల ఇంకేమైనా మిగిలితే పూర్తిగా పోతుందనే భావనతో కొందరు మద్యం తాగటం చూస్తున్నాం. ఇది మంచిది కాదు. కాలేయం దెబ్బతినటం తప్ప దీంతో ఒరిగే ప్రయోజనమేమీ లేదు. ఆల్కహాల్ మోతాదు 60% కన్నా ఎక్కువ ఉన్నప్పుడే వైరస్ చనిపోతుంది. మద్యంలో ఆల్కహాల్ 50% కన్నా తక్కువగానే ఉంటుందని గుర్తించాలి.
- పొగ అలవాటుంటే వెంటనే మానెయ్యాలి.
- మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే పెరుగు, మజ్జిగ, ప్రొబయోటిక్స్ తీసుకోవాలి.