యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం విభిన్న శిల్పాలకు నిలయంగా సిద్ధమవుతోంది. యాదాద్రి గుట్ట భక్తులకు ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మిక పెంపొందించే విధంగా, భక్తి భావం ఉట్టిపడేలా వివిధ దేవతామూర్తుల విగ్రహాలను తీర్చిదిద్దారు. ప్రధానాలయంలో రామాయణ, మహాభారత ఇతిహాసాలను నేటి తరానికి కళ్లకు కట్టేలా... శిల్పులు శ్రమిస్తున్నారు. కృష్ణశిల స్తంభాలపై అపురూప శిల్పాలకు స్థానం ఇస్తున్నారు.
ఇందులో భాగంగానే ఆలయ బాహ్య ప్రాకారంలోని స్తంభాలపై రామాయణంలోని కీలక ఇతివృత్తాలను శిల్పాలుగా మలిచారు. హనుమంతుని సాహసాలు, జీవన వృత్తంలో కీలక ఘట్టాలను పొందుపరిచారు. ఇలాంటి శిల్పాలను ఎంతో ఆకర్షణీయంగా చెక్కి.. నాటి వైభవాన్ని సాక్షాత్కరింపజేశారు.
బంగారం సేకరించే యోచన
సీఎం కేసీఆర్ సూచనలు మేరకు యాదాద్రిని అధికారులు రూపుదిద్దుతున్నారు. ఈ క్రమంలో ఆలయ విమానంపై నారసింహుడి రూపాన్ని ఏర్పాటు చేయాలని యంత్రాంగం భావిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారమయ్యే దిశగా స్వర్ణ భూషణాలతో పంచ నారసింహ ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు యత్నిస్తున్నామని యాడ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈఓ గీతారెడ్డి తెలిపారు. సీఎం చొరవతో ప్రభుత్వం నుంచి బంగారం సేకరించే యోచన ఉందన్నారు. ఆలయ పక్షాన కూడా స్వర్ణ ఆభరణాల తయారీ కోసం దాతలను ఆహ్వానించిన విషయాన్ని గీత గుర్తుచేశారు. ఈ క్రమంలోనే స్వర్ణరథం తయారవుతోందని ఆమె వివరించారు. స్వర్ణ, రజత కానుకల సేకరణ కోసం ప్రత్యేక పథకాన్ని గతేడాది సెప్టెంబర్లో ప్రవేశపెట్టామని వెల్లడించారు.
ఇదీ చూడండి: కరోనాతో కుదేలైన హైదరాబాద్ పండ్ల మార్కెట్ వ్యవస్థ