యాదాద్రి భువనగిరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం విద్యుత్ కాంతులను విరజిమ్ముతోంది. చూడడానికి రెండు కళ్లు చాలనంతగా కాంతులు చిమ్ముతూ కనువిందు చేస్తోంది. యాదాద్రి ఆలయానికి విద్యుత్ అలంకరణతో కొత్త శోభను సంతరించుకున్నాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు.
బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక కాంతులు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనారసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్తు అలంకరణలను చేపట్టారు. కొండ చుట్టూ ఏర్పాటైన గ్రీనరీ కళాత్మకంగా తీర్చిదిద్దారు. భక్త జనులను ఆకర్షించేలా రంగురంగుల విద్యుత్ కాంతులతో దీపాలు అమర్చారు. గోపురాలకు, ఆలయ ప్రహరీకి అలంకరించిన విద్యుత్ దీపాలు కాంతులు విరజిమ్ముతున్నాయి. దేవతామూర్తుల ప్రతిమలు భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. బాలాలయం, కనుమదారిలో కొండకు దక్షిణ దిశలో అమర్చిన విద్యుత్ కాంతులు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
భక్తులకు కనువిందు..
యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల విశిష్టతను పెంచేందుకు విద్యుత్ అలంకరణలు అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఒకవైపు మంత్ర పఠనం, హోమాది పూజలతో క్షేత్ర ప్రాధాన్యతను పెంచగా... భక్తుల కనువిందుకు విద్యుత్ అలంకరణలు దర్శనమిస్తున్నాయి. కొండపైన, కిందిభాగంలో ఆలయ దారులు, వైకుంఠ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులు మరింత శోభతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి.