యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం కొండపై 2.33 ఎకరాల విస్తీర్ణంలో స్వయంభువుల సన్నిధి, మాడ వీధితో కలిపి 4.33 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ ప్రాకార విస్తరణ త్వరలోనే సంపూర్ణం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం యాడా అధికారులు అన్ని పనులను సమాంతరంగా, శరవేగంగా కొనసాగిస్తున్నారు. కాకతీయుల శిల్పకళ ఉట్టిపడేలా ప్రధానాలయం పూర్తిగా కృష్ణశిలతో నిర్మితమవుతుండగా మిగిలిన విస్తరణ పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.
పూర్తయిన పనులు
ఇప్పటికే సప్త గోపురాలతో పంచనారసింహులు కొలువుండే ప్రధానాలయం, గర్భాలయం ఎదుట 12 మంది ఆళ్వారుల శిల్పాలతో కూడిన మహా ముఖ మండపం, రాజగోపురాలు, దివ్య విమాన గోపుర నిర్మాణం, మహా ముఖ మండపం ఎదుట ఆండాళమ్మ, రామానుజుడు, ఆళ్వారుల విగ్రహాలు, క్షేత్రపాలక ఆంజనేయస్వామి ఉప ఆలయాల నిర్మాణాలు, గర్భాలయం ప్రవేశ ద్వారంపై శంకు, చక్ర నామాలు, గరుడ ఆళ్వార్లు, ఆంజనేయస్వామి విగ్రహాలు పూర్తయ్యాయి.
జరుగుతున్న పనులు
మహా ముఖ మండపం ఎదుట గర్భాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఏర్పాటు పనులు మొదలయ్యాయి. కొండపైకి వెళ్లేందుకు మెట్ల మార్గం, రాజగోపుర నిర్మాణం, స్వామి దర్శనం కోసం వచ్చే రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి ముఖ్యులు బస చేసేందుకు వీలుగా ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
ఇప్పటికి రూ.622 కోట్ల వ్యయం
ఆలయ పునర్నిర్మాణం, ఆలయనగరి అభివృద్ధికి మొత్తం రూ.1,800 కోట్లు అవసరమవుతుందని యాడా ప్రాథమికంగా అంచనా వేసింది. ఇప్పటి వరకు ఆలయ విస్తరణతో పాటు కొండపై జరుగుతున్న పనులన్నింటికీ రూ.622 కోట్లు ఖర్చు కాగా మరో రూ.95 కోట్లు బకాయిలు ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి : ఓయూ తెలుగు శాఖ శతాబ్ది సంబరాలు