తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు అంతటా భక్తుల సందడి కనిపిస్తోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులకు స్వామి వారి లఘు దర్శనం ఏర్పాటు చేశారు.
స్వామివారి నిత్యకల్యాణంలో భక్తులు పాల్గొన్నారు. కొండకింద కల్యాణ కట్ట, కొండపైన ప్రసాదాల విక్రయశాల, ఘాట్ రోడ్ల వెంట, క్యూలైన్లలో సత్యనారాయణ స్వామి వ్రత మండపాల వద్ద, ప్రధాన రహదారుల వెంట భక్తుల సందడి కనిపిస్తోంది. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పడుతోంది.
ఆలయ అభివృద్ది పనుల దృష్ట్యా పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు. అందువల్ల కొండకిందే వాహనాలు పార్కింగ్ చేసుకుని ఆటోలో, ఆర్టీసీ బస్సులో పలువురు భక్తులు కొండపైకి వెళ్తున్నారు. భక్తులు అధికంగా రావడంతో వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం వలయ రహదారి వెంట వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: 'విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ఎన్నో మైలురాళ్లు దాటాం'