యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వార్షిక జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 25వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. లాక్డౌన్ కారణంగా భక్తులెవరినీ అనుమతించట్లేదని ఆమె అన్నారు. మొదటి రోజు జయంతి ఉత్సవాల్లో భాగంగా అంకురార్పణ, ఋత్విక్వరణము పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం స్వామి వారిని పరవాసుదేవ అలంకారంలో గరుడ వాహనంపై బాలాలయంలో ఊరేగించినట్లు వివరించారు.
పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం, మంత్ర పటణాల మధ్య పుట్ట మట్టితో నవ ధాన్యాలను నాటి వేడుకలకు అంకురార్పణ చేశారు. యాగశాలలో ఈ పర్వాలను జరిపారు. ఆళ్వారులలో ప్రథములైన నమ్మాళ్వార్ల తిరునక్షత్రోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మొదటి రోజు చేపట్టిన వేడుకల్లో ఆలయ ఈవో గీత, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పాతగుట్ట ఆలయంలోనూ స్వామి వారి జయంతి ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఇదీ చదవండి : రెండు రోజులుగా కఠినంగా లాక్డౌన్ అమలు