Munugode By Election On Campaign Revanth: మునుగోడు నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే కొందరు పశువుల్లా అమ్ముడుపోయారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అమ్ముడుపోయిన నేతలను ఆదరించవద్దని కోరారు.
ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నపార్టీ నుంచి.. రాజగోపాల్ రెడ్డి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి పోయారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అభివృద్ధి ఎట్లా జరుగుతుందో రాజగోపాల్ రెడ్డికే తెలియాలని ప్రశ్నించారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ మారాలని బెదిరిస్తే.. వారు ఎంతటి వారైనా వాళ్ల వీపు విమానం మోత మోగుతుందని హెచ్చరించారు. ఓట్ల రూపంలో వారిని చిత్తు చిత్తుగా ఓడించాలని అక్కడి ప్రజలకు సూచించారు.
పేదల కోసం కాంగ్రెస్ చేసిన పనులను గుర్తు పెట్టుకోండి : చీర నేసే పని కూడా సిరిసిల్లకే పోతోందని ఈ విషయంమై ఇక్కడ ఉన్న పద్మశాలీ సోదరులు ఆలోచించాలని రేవంత్ రెడ్డి అన్నారు. పేదల కోసం కాంగ్రెస్ చేసిన పనులను గుర్తు పెట్టుకుని నిర్ణయం తీసుకోండని తెలిపారు. కాంగ్రెస్‌కు అండగా నిలబడి గెలిపించాలని కోరారు. నాలుగు ఉప ఎన్నికల్లో తెరాస, భాజపాలను గెలిపిస్తే మార్పు ఏమి రాలేదని రెేవంత్ రెడ్డి విమర్శించారు.
మహిళలంటే కేసీఆర్కు చిన్నచూపని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒక ఆడబిడ్డకు మునుగోడులో ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇవ్వండని కోరారు. మీ సమస్యలపై కొట్లాడి మీ వైపు నిలబడుతుందని చెప్పారు. ఆడబిడ్డ ఆత్మగౌరవం నిలబెట్టండి.. ఆడబిడ్డల శక్తిని చూపించండని అక్కడి ప్రజలను రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
"ఒకరు ఓటుకు రూ.30వేలు అంటే మరొకరు రూ.40వేలు ఇస్తామని గొప్పలు చెబుతున్నారు. ఇవన్ని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు. మీకు ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ ఇచ్చింది. మూడు అడుగుల జగదీశ్ రెడ్డి మంత్రిగా 8సంవత్సరాలు చేశారు. ఒక్క డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారా. రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు. చీర నేసే పని కూడా సిరిసిల్లకు పోయింది తప్ప కొయ్యలగూడెంలోని పద్మశాలీలకు పోయింది. పేదల కోసం కాంగ్రెస్ చేసిన పనులను గుర్తు పెట్టుకుని నిర్ణయం తీసుకోండి. నాలుగు ఉప ఎన్నికల్లో తెరాస, భాజపాలను గెలిపిస్తే మార్పు ఏమి రాలేదు. ఒక ఆడబిడ్డకు మునుగోడులో ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇవ్వండి. ఆడబిడ్డ ఆత్మగౌరవం నిలబెట్టండి. ఆడబిడ్డల శక్తిని చూపించండి." -రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపై దృష్టి సారించిన కాంగ్రెస్
108 ఏళ్ల వృద్ధురాలిపై దారుణం.. బాత్రూమ్కు తీసుకెళ్లి.. కాళ్లు నరికి..