యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మహా దివ్యంగా రూపొందించే క్రమంలో సరికొత్త విద్యుత్ కాంతులు విరజిమ్మేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ద్వారకా కంపెనీ నుంచి బ్యాలెట్ లైట్లను రప్పిస్తున్నారు. ఆలయం నలు వైపులా మాడ వీధుల్లో అల్యూమినియం, ఇత్తడి లోహంతో తయారైన... 160 లైట్ల బిగింపునకు యాడా నిర్ణయించింది.
సీఎం కేసీఆర్ రేపు రానున్న సందర్భంగా 74 లైట్లను మంగళవారం తీసుకొచ్చారు. వాటిని ఇన్స్టాల్ చేసే పనులను చేపడుతున్నారు. సంప్రదాయ హంగులతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారు.
పంచ నారసింహ సన్నిధిలో వైష్ణవ సంప్రదాయ వనరుల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఆ క్రమంలోనే స్వయంభువుల్లో ఒకరైన గండభేరుండ నారసింహస్వామి సన్నిధిలో ఉంచేందుకు... అల్యూమినియం, ఇత్తడి లోహంతో సిద్ధమైన స్తూపం, అఖండ దీపం వెలిగించే చెమ్మెలను తీసుకొచ్చారు. ఆలయ ముఖ మండపంలో పడమటి దిశలో వైష్ణవ ఆరాధ్యులు, రామానుజుల శిలా రూపం పొందుపరిచేందుకు సంసిద్ధమవుతున్నారు.
ఇదీ చూడండి : అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తాం: కేటీఆర్