ఏఐసీసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో దేశ వ్యాప్తంగా ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్యులు పాల్గొని ఆయా రాష్ట్రాల్లో తాజా పరిస్థితులను సోనియాగాంధీకి వివరించారు. అందులో భాగంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని సోనియా గాంధీతో మాట్లాడారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా పరిణామాల గురించి వివరించారు.
పరీక్షలు సరిగ్గా చేయడం లేదు
నాలుగు కోట్ల ప్రజల చిరకాల కోరికను సోనియాగాంధీ నిజం చేశారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనియాడారు. విద్యార్థుల ఆత్మ బలిదానాలు చూడలేక తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్‌తో ఇచ్చినట్లు గుర్తు చేశారు. కేసీఆర్ తన నిరంకుశ పాలనతో రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ విలవిల లాడుతోందని... రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు తగిన సంఖ్యలో చేయడం లేదని, కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధానికి లేఖ రాయాలి
రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీకి లేఖ రాయాలని సోనియాగాంధీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా రాష్ట్రాన్ని కాపాడాలని కోరారు. సోనియాగాంధీకి భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగించాలని తాను దేవున్ని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ప్రగతి భవన్కు చేరుకున్న సీఎం కేసీఆర్