తెలంగాణ సాయుధ పోరాట యోధులు, రామన్నపేట మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కాంస్య విగ్రహాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఆయన విగ్రహానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు, దాతల సహకారంతో మండల సీపీఐ పార్టీ శ్రేణులు యాదగిరిరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా అరుణ పతాకాలతో కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.
పేద రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ అందరి మంచి కోసం యాదగిరి రెడ్డి పాటు పడ్డారని చాడ గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా మూడు సార్లు సీపీఐ నుంచి గెలుపొందారని, సొంత ఇల్లు కూడా లేకుండా సాధారణ జీవితం గడిపారని అన్నారు. బాల్యదశ నుంచి నిబద్ధత కలిగిన మంచి మనిషిగా అందరి మన్ననలు పొందిన వ్యక్తి గుర్రం యాదగిరి రెడ్డి అని కొనియాడారు.
ఇదీ చదవండి: ఖమ్మం బల్దియా పోరుకు తెరాస కసరత్తు.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు