యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో యాదాద్రి ఆలయ విద్యుత్ అవసరాల కోసం ఉపకేంద్రాన్ని నిర్మించారు. కానీ ప్రారంభించక ముందే... మరో చోటుకి తరలించనున్నట్లు తెలుస్తోంది. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా... 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని నిర్మించారు. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకంలో భాగంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ దీని నిర్మాణం చేపట్టింది.
ఆలయ పనులు పూర్తి కాగానే నిర్వహించ తలపెట్టిన మహా సుదర్శన యాగం స్థలంలోనే ఉన్నందున తొలగించాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆలయ ఈవో గీతను వివరణ కోరగా... యాగ నిర్వహణకు స్థలం సరిపోదనే పాత గోశాలను మార్చినట్లు తెలిపారు. అవసరమైతే విద్యుత్ ఉపకేంద్రాన్ని కూడా మరో చోటుకు మార్చే అవకాశం ఉందన్నారు.