యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిలో భాగంగా యాదాద్రి కొండపై విష్ణు పుష్కరణి వెనుక ఉన్న ప్రహారీ గోడను కూల్చివేత పనులను వైటీడీఏ అధికారులు చేపట్టారు. ఇటీవల యాదాద్రిని సందర్శించిన కేసీఆర్ కొండపై స్వామివారి నిత్య కైంకర్యాలకు వినియోగించే విష్ణు పుష్కరణి వెనుక భాగంలో విశాలమైన స్థలం ఉండగా... గోడను చాలా దగ్గరగా నిర్మించారని దాన్ని వెంటనే తొలగించి దూరంగా నిర్మించాలని సూచించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు కూల్చివేత పనులు చేపట్టారు.
యంత్రాల బిగింపు పనులు..
యాదాద్రిలో ప్రసాదం కాంప్లెక్స్‌లో కింది అంతస్తులో తయారైన లడ్డూలను... ముందుగా లిఫ్ట్ ద్వారా నాలుగు అంతస్తుల పైకి తెచ్చి అక్కడి నుంచి విక్రమ కౌంటర్లకు తరలించేందుకు యంత్రాలను అమర్చుతున్నారు. ప్రసాదం విభాగంలో ఇప్పటికే మూడు అంతస్తుల్లో లడ్డూ ప్రసాదాల తయారీ చేపట్టే బాయిలర్లు, ముడి సరుకును కలిపే యంత్రాలు, భక్తులకు విక్రయాలు జరిపే లడ్డూ, పులిహోర, వడ, తయారీ యంత్రాల అమరిక చేపట్టారు. సుమారు రోజుకు లక్ష లడ్డూలను తరలించేందుకు ఉపయోగించే యంత్రాలను రాజస్థాన్ నుంచి తీసుకువచ్చినట్లు ఇస్కాన్ సంస్థ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: లంకెబిందెల్లో 5 కిలోల బంగారం.. ఎక్కడో తెలుసా..?