చేనేత కార్మికుల న్యాయమైన కోరికలు నెరవేర్చి... ఆకలి చావులను ఆపాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగొని రామచంద్రుగౌడ్ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో చేనేత కార్మికులు చేపట్టిన రిలే నిరహార దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు వెంటనే విడుదల చేయాలని నాయకులు కోరారు.
చేనేత కార్మికులు, సంఘాల దగ్గర ఉన్న వస్త్ర ఉత్పత్తులు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ప్రతి చేనేత కార్మికుల కుటుంబానికి నెలకు రూ.8వేల జీవన భృతి అందించాలని కోరారు. వారసత్వ కళ అయిన చేనేత వృత్తికి ప్రభుత్వమే భద్రత, భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, మోత్కూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మందుల సురేశ్, మండల కాంగ్రెస్ నాయకులు గుండు శ్రీను తదితరులు పాల్గొన్నారు.