యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రానికి చెందిన వేముల రాములు, లక్ష్మి దంపతులు. వీరికి ఒక్కగానొక్క కొడుకు అనిల్. గృహనిర్మాణంలో సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్న కుటుంబం. ఏడేళ్ల క్రితం రోజూలాగే పనికిపోయిన కుమారుడు ప్రమాదంలో గాయపడి.. మంచానికే పరిమితమయ్యాడు. నడుముకు బలంగా దెబ్బ తగలడం వల్ల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. మెరైగున వైద్యానికి ఖర్చు ఎక్కువ అవుతుండడంతో నిమ్స్‌కు తరలించారు. కుమారుడి మందుల కోసం రోడ్డు దాటుతుండగా తండ్రి రాములు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నడుముకు బలమైన గాయాలు కావడంతో అదే ఆస్పత్రిలో చికిత్స(Need financial help) అందించారు. చేతికందవచ్చిన కుమారుడు, అండగా ఉండాల్సిన భర్త ఇద్దరూ మంచానికే పరిమితమయ్యారు.
నా కొడుకు బిల్డింగ్ మీది నుంచి కింద పడ్డాడు. ఆస్పత్రిలో చేర్పించినం. చాలా డబ్బులు ఖర్చు పెట్టినం. అదేసమయంలో మందులు తీసుకురావడానికి మా ఆయన వెళ్తే రోడ్డు మీద ఎవరో గుద్దిన్రు. ఆయనకూ చాలా దెబ్బలు తగిలినయ్. అదే ఆస్పత్రిలో చేర్పించినం. ఇద్దరికీ వైద్యం చేయించినం. ఇక మా వల్లకాక ఇంటికి తీసుకొచ్చినం. ఆ ఇద్దరినీ నేనే సాకుతున్న. కూలీకి పోయి కడుపు నింపుతున్నా. మా పరిస్థితి ఇట్లా ఉంది. ఎన్ని డబ్బులు పెట్టినా ఆయన సక్కగా కాలేదు. రూ.30వేలకు ఒక సూది అన్నారు. మా చేతకాక ఇక వదిలేసినం. వాళ్లు అట్లనే ఉంటున్నారు. ఆయన అక్కడ... పెండ్లీడుకొచ్చిన కొడుకు ఇక్కడ. చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. దాతలు ఎవరైనా స్పందించి సాయం చేయాలని కోరుతున్నాం.
-లక్ష్మి, రాములు భార్య
ఇంటి బాధ్యతను ఇల్లాలు లక్ష్మి తన భుజానికెత్తుకుంది. భర్త, కొడుకుకూ సపర్యలు చేస్తూ... కూలీ పనికి పోతుంది. అలా వచ్చిన కొద్దిమొత్తంతో కాలం వెల్లదీస్తున్నారు. తండ్రీకొడుకులిద్దరికీ ఆరోగ్యం కుదుట పడాలంటే ఒక్కో ఇంజక్షన్ రూ.30 వేలు ఖర్చు అవుతుందని... తాను సంపాదించినది పొట్టకే సరిపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నేను కూలికి పోతే రోజుకు రూ.250 వస్తాయి. మా ఆయన, కొడుకుతోపాటు మా అత్త రామనర్సమ్మ ఇంట్లో ఉంటుంది. ఆమెకు కళ్లు సరిగా కనిపించవు. ఇంట్లో ముగ్గురి బాగోగులు నేనే చూసుకుంటున్నాను. రెక్కల కష్టమీదే ఏడేళ్లుగా కాలం వెల్లదీస్తున్నాం. అప్పటి నుంచి కనీసం పండుగలు జరుపుకోవవడం కూడా మానేశాం. -లక్ష్మి, రాములు భార్య
ప్రస్తుత పరిస్థితుల్లో తన కూలీ డబ్బులు సరిపోకపోవడం వల్ల బతుకు మరింత భారమవుతోందని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి తన భర్త, కుమారుల వైద్యానికి సాయం చేయాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: Health Tips in Telugu: మీరు ఫిట్‌గానే ఉన్నారా? లేదా?.. ఇలా తెలుసుకోండి!