యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గర్భాలయంపై 45 అడుగుల దివ్య విమానానికి స్వర్ణ తాపడం కోసం దాతల ద్వారా దాదాపు 8 కిలోల బంగారం సమకూరింది. పునర్నిర్మితమైన పంచనారసింహుల ఆలయాన్ని మహాదివ్యంగా రూపొందించే యోచనతో కృష్ణశిలతో నిర్మించిన విమానాన్ని స్వర్ణమయం చేసేందుకు భక్తులంతా భాగస్వాములు కావాలని, ఈ క్షేత్రాభివృద్ధికి సంకల్పించిన సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
దీంతో దాతల ద్వారా 2022 సంవత్సరాంతం వరకు నగదు రూ.33 కోట్లు, బంగారం 8 కిలోలు సమకూరినట్లు ఆలయ ఈవో గీత శనివారం తెలిపారు. 2021 అక్టోబరు 19న విమానం స్వర్ణమయం చేసేందుకు 125 కిలోల బంగారం అవసరమని, ఈ మేరకు భక్తులు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. ఆ సందర్భంలో తన కుటుంబం పక్షాన కిలో బంగారం సమర్పిస్తానని కేసీఆర్ ప్రకటించి ఆ మేరకు అందజేశారు.
ఆన్‌లైన్, క్యూఆర్ కోడ్ స్కాన్, హుండీలతో పాటు నేరుగా బంగారం, నగదు విరాళాల సేకరణ పర్వం కొనసాగుతోంది. స్తంభోద్భవుడి సన్నిధిని చూస్తే మళ్లీ మళ్లీ రావాలనిపించేలా స్వర్ణవిమానం రూపకల్పనకు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం రాగి తొడుగులతో విమానం కొలతలు సేకరించారు. ఆరు నెలల్లోగా స్వర్ణ విమానం భక్తులకు దర్శనమిచ్చే అవకాశాలున్నాయి.
నేడు, రేపు.. దర్శనం, ఆరాధనల వేళల్లో మార్పులు: యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆంగ్ల సంవత్సరారంభం, ఆ మర్నాడు రెండు రోజుల పాటు దైవ దర్శనం, ఆరాధనల నిర్వహణల వేళల్లో మార్పులు చేశారు. రోజూ ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలను గంట ముందుగా జరపనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. పునర్నిర్మితమైన ప్రధానాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రప్రథమంగా ఉత్తర ద్వార దర్శనం, అధ్యయనోత్సవాలకు జనవరి 2న శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 6.48 గంటలకు శ్రీ యాదగిరీశుడు గరుడ వాహనంపై పరవాసుదేవుడి రూపంలో ఉత్తర గోపుర ద్వారం వద్ద దర్శనమిస్తారు.
ఇవీ చదవండి: