సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. వరంగల్లో కేసీఆర్ పర్యటన సందర్బంగా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. సామాన్య ప్రజలనే కాకుండా ఎమ్మెల్యేను కూడా అడ్డుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా రోడ్లపైకి ఎవ్వరినీ రానివ్వ లేదు. నర్సంపేట అధికార పార్టీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. హన్మకొండ మీదుగా సీఎం కేసీఆర్ వద్దకు వెళ్తుండగా ..అనుమతి లేదని ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. హెడ్ క్వార్టర్స్ వద్దనే పోలీసులు నిలిపివేయడంతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే కారు దిగి.. అక్కడి నుంచి అర్‌అండ్‌బీ అతిథి గృహం వరకు నడిచి వెళ్లారు.
మరో చోట అదే అనుభవం..
పోలీసుల తీరుకు నిరసనగా అధికార పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సొంత పార్టీ ఎమ్మెల్యే.. సీఎం వద్దకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏంటని స్థానిక నేతలు మండిపడుతున్నారు. అంతేకాకుండా ఏకశిలా పార్క్ వద్ద సీఎం సభలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే వెళ్తే.. అక్కడ కూడా అనుమతి లేదని పోలీసులు మరోసారి అడ్డుకోవడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు.
పోలీసులతో వాగ్వాదం..
పోలీస్ ఆంక్షలతో వరంగల్ నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు హన్మకొండ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం నుంచి ఎంజీఎం వరకు ఆంక్షలు విధించడంతో వాహనదారులు ఎటు పోవాలో తెలియక పలుచోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇది గాక వరంగల్ హన్మకొండను కలుపుతూ నగరపాలక సంస్థ వేసిన కొత్త రహదారి వద్ద గేట్లు మూసివేయడంతో వాహనదారులకు చుక్కలు కనిపించాయి. వరంగల్, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి రహదారులను ఎక్కడికక్కడే మూసివేయడంతో హనుమాన్ జంక్షన్ నుంచి ములుగు క్రాస్ రోడ్డు వరకు భారీగా వాహనాలు నిలిచాయి.
ఇదీ చదవండి: drugs seized: శంషాబాద్ విమానాశ్రయంలో రూ.20 కోట్ల డ్రగ్స్ స్వాధీనం