Katakshapur Bridge Rains issues : హనుమకొండ నుంచి మేడారం వెళ్లే మార్గంలో జాతీయ రహదారి 163పైన ఉన్న.. కటాక్షాపూర్ పాత వంతెనకు మోక్షం కలగకపోవడంతో వాహనదారులకు కష్టాలు తప్పడంలేదు. హనుమకొండ నుంచి నిత్యం వేలాదిగా వాహనాలు ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటాయి. పక్కనే ఉన్న కటాక్షాపూర్ చెరువు.. కాస్త వర్షం వస్తే చాలు మత్తడి పోస్తుంది. లోలెవల్ వంతెన కావడంతో మత్తడి నీళ్లన్నీ వంతెనపైకి వచ్చేస్తాయి. ఇక అంతే వంతెనపై రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోవాల్సిందే.
Hanamkonda Rains : ముప్పై ఏళ్లుగా ఇదే సమస్య ఉన్నా.. ఇప్పటికీ కొత్త వంతెన నిర్మాణానికి ముహుర్తం కుదరట్లేదు. ఇటీవల వర్షాలు ఎక్కువ కావడంతో సమస్య మరీ ఎక్కువైంది. రూ.317 కోట్లతో వంతెన సహా 4 వరుసల రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నిధులూ మంజూరయ్యాయి. కానీ గుత్తేదారు నిర్లక్ష్యం అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణా లోపంతో వంతెన నిర్మాణంలో ఎడతెగని జాప్యం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.
"గత సంవత్సరాల నుంచి కూడా ఈ బ్రిడ్జి ఇలానే ఉంది. దీనిని పట్టించుకునేవారు ఎవరూలేరు. అంతకముందు ఇక్కడికి సీఎం కేసీఆర్ వచ్చారు.. కానీ ఇక్కడ ఎటువంటి మార్పు రాలేదు. వర్షాకాలంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.. కానీ అధికారులు మాత్రం కాస్త కూడా పట్టించుకోవడం లేదు. ఈ బ్రిడ్జి నిర్మిస్తేనే మాకు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది. లేకుంటే వర్షాకాలంలో మాకు ఇబ్బందులు తప్పవు. చాలా మంది బ్రిడ్జిని దాటేతప్పుడు ప్రమాదాల బారినపడుతున్నారు. బ్రిడ్జి నిర్మిస్తే మాకు చాలా బాగుంటుంది." - స్థానికుడు
Katakshapur Lake Overflow : హనుమకొండ నుంచి ములుగు, భూపాలపల్లి వెళ్లాలంటే ఈ మార్గంలోనే వెళ్లాలి. రామప్ప, లక్నవరం, వెళ్లే పర్యాటకులు, మేడారం వెళ్లే భక్తులు ఇక్కడి నుంచే ప్రయాణించాలి. వర్షాకాలంలో తరచూ రాకపోకలు నిలిచి ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. పలువురు నీటి ఉద్ధృతిలోనే.. వంతెన దాటి ప్రమాదాల బారినపడుతున్నారు. వెంటనే వంతెన నిర్మాణం చేపట్టి.. కష్టాలు తీర్చాలని గ్రామస్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.
"వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ రోడ్డు బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడు వర్షాకాలంలో మమ్మల్ని ఈ బ్రిడ్జి ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పంధించి బ్రిడ్జి కడితే ప్రయాణికులకు, గ్రామస్థులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ బ్రిడ్జి దగ్గర చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకసారి అయితే ఓ కారు ప్రవాహానికి కొట్టుకుపోయింది. మా బాధను ప్రభుత్వం అర్థం చేసుకుని బ్రిడ్జిని నిర్మించాలని కోరుకుంటున్నాం." - స్థానికుడు
ఇవీ చదవండి: