కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో... ఆన్‌లైన్ విద్య, డిజిటల్ పాఠాల ప్రాధాన్యత గణనీయంగా పెరిగిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. పాఠశాలలు మూసేసిన ప్రస్తుత తరుణంలో... విద్యార్థి జ్ఞాన సముపార్జనకు ఆన్‌లైన్ విద్యే ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. ఆన్‌లైన్ విద్య అవకాశాలు, సవాళ్లు అన్న అంశంపై వరంగల్ నిట్ నిర్వహించిన జాతీయ వెబినార్‌ను గవర్నర్ ప్రారంభించారు.
సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. ఇంట్లోనే పాఠాలు నేర్చుకోవడం ఓ చక్కటి అవకాశమని ఇదే సమయంలో మారుమూల గ్రామాల్లో నివసించే వారికి ఓ సవాల్‌గా స్వీకరించి ఆన్‌లైన్ పాఠాలను అందించాలని అన్నారు. విద్యార్థుల్లో ఆన్‌లైన్ బోధనపై ఆసక్తి పెంచి... ప్రోత్సహించాలని చెప్పారు. వెబినార్‌ను ప్రారంభించిన గవర్నర్‌కు నిట్ సంచాలకులు ఎన్.వి.రమణా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నైపుణ్యవిద్య ద్వారా నిట్ విద్యార్థులు... మేటిగా రాణిస్తున్నారని వివరించారు.