2001లో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదిత్యనాథ్ దాస్ ప్రయాణించే వాహనంపై నక్సలైట్లు కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఆయనను ప్రాణాలతో డ్రైవర్ సాంబయ్య రక్షించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఆ దుర్ఘటన తాలూకు జ్ఞాపకాలను హన్మకొండకు చెందిన అప్పటి కలెక్టర్ వాహన డ్రైవర్ సాంబయ్య గుర్తు చేసుకున్నాడు.
2001లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరునాగారంలో కలెక్టర్ ఆదిత్యనాథ్ దాస్ ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో పాల్గొని తన వాహనంలో తిరిగి వస్తుండగా మావోయిస్టులు వాహనంపై కాల్పులు జరిపారు. భుజం నుంచి బులెట్ దూసుకెళ్లడంతో ఆదిత్యనాథ్ గాయపడ్డారు. డ్రైవర్ సాంబయ్య కాలికి బుల్లెట్లు తగిలి తీవ్ర రక్త స్రావమైంది. ఆ పరిస్థితుల్లో గాయాన్ని లెక్కచేయకుండా కారును వేగంగా నడిపి కలెక్టర్ ప్రాణాలను కాపాడాడు.
ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ బుల్లెట్ గాయంతో ఇప్పటికీ సరిగ్గా నడవలేకపోతున్నానని సాంబయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదీ చదవండి: ఆ యువతకు దేశసేవే ఊపిరి.. సైన్యంలో చేరడమే లక్ష్యం