Bandi Sanjay Comments: అధికారంలో ఉన్నామని సీఎం కేసీఆర్ విర్రవీగుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది తామేనని గుర్తుచేశారు. జైలుకు వెళ్లడం తమకు కొత్తేమీ కాదన్నారు. హనుమకొండలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై భాజపా నిరసన సభ నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు.
Bandi Sanjay Comments: 317 జీవోతో ఉద్యోగులను సీఎం ఇబ్బందులు పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారన్న సంజయ్... పోరాటానికి అండగా ఉంటామని ప్రధాని ఫోన్ చేసి చెప్పినట్లు తెలిపారు. ఉద్యోగులకు భాజపా అండగా ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని వెల్లడించారు. 317 జీవోకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో భారీ సభ పెడతామని సంజయ్ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాకు ఫోన్ చేశారు. మీరు పోరాడుతున్న తీరు అద్భుతమని కొనియాడారు. మనకు అండగా ఉంటామన్నారు. 317 జీవో విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా ఉండమని సూచించారు. భాజపా కార్యకర్తలకు త్యాగాలు కొత్తకాదని చెప్పామన్నారు. ఉద్యోగులకు, కార్యకర్తలకు భరోసా ఇవ్వమన్నారు. దేశ ప్రధాని మామూలు కార్యకర్తకు ఫోన్ చేసిండంటే అది కమిట్‌మెంట్ అంటే. ఏ పార్టీ నాయకుడు ఫోన్ చేయడు కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంటే. మేం ఒక లక్ష్యం అనుకున్నాం. 2023లో గోల్కొండ కోట ఖిల్లాపై కాషాయపు జెండా ఎగురవేస్తాం.
-- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
అసోం చిన్న రాష్ట్రమైనా తెలంగాణ కంటే అద్భుతంగా పనిచేస్తున్నామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. లక్షల కోట్ల ఆదాయం ఉన్నా తెరాస సర్కారు.... ఒక కుటుంబం కోసమే పనిచేస్తోందని విమర్శించారు.
నేనిక్కడికి నేర్చుకుందామని వచ్చాను. కానీ ఏం నేర్చుకోను..నేను ప్రభుత్వ కార్యాలయానికి రోజూ వెళ్తాను. కేసీఆర్ నుంచి నేర్చుకుంటే నేను కూడా ఫాం హౌజ్‌లో బందీ అయిపోతాను. ఒక ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఇచ్చే సూత్రం నేర్చుకుందామని వచ్చాను. కానీ ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వకుండా ఉండే సూత్రం అమలు చేస్తున్నారు. ఇక్కడ నేనేదైనా నేర్చుకునే ప్రయత్నం చేస్తే నా బండి గాడితప్పుతుంది.
-- హిమంత బిశ్వశర్మ, అసోం ముఖ్యమంత్రి
పాదాభివందనం చేసిన సీఎం..
భాజపా సీనియర్ నేత గుజ్జుల నర్సయ్యకు అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ పాదాభివందనం చేశారు. హనుమకొండలో నిరసన సభకు వచ్చిన బిశ్వశర్మ... తాను ఏబీవీపీలో పనిచేస్తున్నప్పుడు తన సీనియర్ అయిన పూర్వ ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు నర్సయ్య( రిటైర్డ్ లెక్చరర్). స్టేజీపై ఉన్న సీఎంకు నర్సయ్య లేఖ పంపారు. ముఖ్యమంత్రి హోదాను పక్కకు పెట్టి స్టేజి దిగి ఆయన వద్దకు వచ్చి పాదాభివందనం చేశారు. నర్సయ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఫోన్లో మాట్లాడుతానని తెలిపారు. నర్సయ్యను అసోంకు రావాలని ఆహ్వానించారు. వారి కుటుంబ సభ్యులతో సీఎం ముచ్చటించారు.
ఇవీ చూడండి: Assam CM: హైదరాబాద్కు అసోం సీఎం.. భాజపా నేతల ఘనస్వాగతం
BJP Incharge Tarun Chugh: పోలీసులు గులాబీ కండువాలు కప్పుకున్నట్లు ప్రవర్తిస్తున్నారు: తరుణ్ చుగ్