Accident While going to BRS Party Meeting in Warangal : ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్న సభల వల్ల కొన్నిసార్లు సామాన్యుల ప్రజలు గాల్లో కలిసి పోతున్నాయి. ఆ సభా ప్రాంగణంలో జరుగుతున్న అనుకోని ప్రమాదాల వల్ల కొందరు.. సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో జరుగుతున్న ప్రమాదాల వల్ల మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ఇద్దరు మరణించిన ఘటన మరవకముందే.. ఆ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్తున్న మరికొందరు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.
వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి అధ్యక్షతన నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి జనంతో వెళ్తున్న ఓ వాహనం ప్రమాదానికి గురైంది. రాయపర్తి మండలంలోని ఊకల్ గ్రామ శివారులో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సభకు జనాన్ని తీసుకువెళ్తున్న ఓ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులకు తీవ్ర గాయాలు కాగా.. మరో 10 మందికి స్వల్పంగా గాయపడ్డారు.
BRS Party Meeting in Warangal : ఊకల్ గ్రామంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో క్యాటరింగ్ పని నిమిత్తం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను తొర్రూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి సభా ప్రాంగణం నుంచి హుటాహుటిన తొర్రూర్‌కు చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Khammam Fire Accident News : గతంలో ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సమావేశంలో కూడా అపశ్రుతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే సమావేశానికి పార్టీ నేతలు వస్తున్న సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. ఆ నిప్పురవ్వలు కాస్త ఎగిసిపడి సమీపంలోని గుడిసెపై పడడంతో మంటలు చెలరేగాయి. వాటిని అదుపుచేసేందుకు అక్కడే ఉన్న స్థానికులు, పోలీసులు బిందెలతో నీళ్లు చల్లారు. మంటల తాకిడికి గుడిసెలో ఉన్న సిలిండర్‌ను అక్కడున్న వారు ఎవరూ గమనించలేదు. ఈ క్రమంలో ఆ సిలిండర్ ఒక్కసారిగా పెద్దశబ్దంతో పేలడంతో దాని ధాటికి 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పేలుడు వల్ల సిలిండర్ తునాతునకలై దాని శకలాలు ఎగిరొచ్చి తగలడంతో పలువురు గాయపడ్డారు. బాధితుల శరీరభాగాలు ఛిద్రమై పరిస్థితి అక్కడ నెలకొంది. అప్రమత్తమైన సిబ్బంది.. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను పోలీసు వాహనాల్లో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలో ఒకరు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కొల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిలో నలుగురిని హైదరాబాద్ నిమ్స్‌కి తరలిస్తుండగా మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు.
ఇవీ చదవండి: