Revanthreddy Speech at Hath Se Hath Jodo Yatra: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. ప్రజలు అడుగడుగున పూలతో స్వాగతం పలుకుతూ ఉత్సాహంగా యాత్రలో పాల్గొంటున్నారు. గురువారం వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేపట్టిన రేవంత్‌రెడ్డి సాయంత్రం వర్ధన్నపేటలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్నారు. తనదైన శైలిలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఉద్ధేశిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రజలను మోసం చేశారు : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఓటు వేయకపోయినా బాధపడలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం ఇచ్చిన తర్వాత కూడా రాజకీయంగా కాంగ్రెస్ నష్టపోయిందన్నారు. రాజకీయంగా నష్టపోయినా.. కాంగ్రెస్ ఎప్పుడూ బాధపడలేదని పేర్కొన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చామని సంతృప్తిపడిందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు చూసి ప్రజలు కేసీఆర్‌ను రెండుసార్లు సీఎంను చేశారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని రేవంత్ మండిపడ్డారు. ఉద్యోగాలు, రెండుపడక గదుల ఇళ్లు, ఎస్సీలకు మూడెకరాలు వంటి హామీలతో మోసం చేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు ఇస్తారనుకుంటే గొర్లు, బర్లు, చేపలు పెంచుకోవాలని చెప్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
'చదువుకున్న యువకులకు ఉద్యోగాలు రాలేదు. కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ పదవులు వచ్చాయి. 8 ఏళ్లుగా ఎవరికీ రెండుపడకల గదుల ఇళ్లు రాలేదు. కేసీఆర్ చెప్పిన రూ.లక్ష రుణమాఫీ జరగలేదు. ఎంపీ కోమటిరెడ్డి పై దాడిని ఖండిస్తున్నాం. దాడులు కొనసాగితే చూస్తూ ఊరుకునేది లేదు. మా కార్యకర్తలు కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ నాయకులు బయట తిరగలేరు. అందరి లెక్కలు రాసి పెట్టుకుంటున్నాం.. మిత్తితో సహా చెల్లిస్తాం.'-రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
పగటిపూట కరెంటు ఇవ్వాలి : గురువారం 10వ రోజు వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో రేవంత్ పాదయాత్ర చేశారు. మొదట ఐనవోలు మల్లిఖార్జున స్వామిని దర్శనం చేసుకొని యాత్రను ప్రారంభించారు. అలాగే ఐనవోలులోని 133 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్లో ట్రాన్స్‌కో ఏఈ తోట ఐలయ్యను కలిసి వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు కరెంట్ ఎప్పుడు వస్తుందో వారం ముందే షెడ్యూల్ ఇవ్వాలని, రాత్రిపూట కరెంటుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న రేవంత్.. పగటిపూట కరెంటు ఇవ్వాలని కోరారు.
ఏసీడీ, ఎఫ్సీఏ ఛార్జీలు వసూలు చేయకూడదని మినిట్స్‌లో రాసి అధికారులకు చెప్పాలన్నారు. అదే విధంగా మొక్క జొన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొక్కజొన్న తోటలో కొంత సేపు కోత మిషన్‌ను రేవంత్ రెడ్డి నడిపారు. అటు నుంచి పెరుమాండ్ల గూడెం, పంథిని, ఉప్పరపెల్లి క్రాస్ రోడ్డు మీదుగా వర్ధన్నపేట వరకు పాదయాత్ర కొనసాగింది. దారి పొడవునా గ్రామస్థులను కలిసి... వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుంటూ యాత్రను సాగించాడు.
ఇవీ చదవండి: