వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పురపాలక సంఘం అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను సరిగ్గా పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వారం రోజుల క్రితం ఓ వ్యక్తి హరితహారం మొక్కను తొలగించాడని.. అతనికి రూ. 20 వేల జరిమానా విధించిన విషయం విదితమే. ఇప్పుడు తాజాగా దుకాణంలో బాలకార్మికులను నియమించినందుకు మరో వ్యక్తికి రూ. 50 వేలు జరిమానా విధించారు.
ఇదీ చదవండిః మొక్కే కదా అని పీకేస్తే.. రూ. 20 వేల జరిమానా విధించారు!
వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఓ బైకు మెకానిక్ షాపు నిర్వాహకులు.. ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా షాపు నడిపిస్తున్నారు. ఇదే కాకుండా.. అతని దుకాణంలో బాలకార్మికులతో పనులు చేయిస్తున్నందుకు యజమానికి రూ. 50 వేల జరిమానా విధించారు పురపాలక అధికారులు. వీటితో పాటు షాపును సీజ్ చేసి సదరు యజమానికి నోటీసులు అందజేశారు. మున్సిపల్ అదికారుల చర్యల పట్ల పట్టణవాసులు ఆనందం వ్యక్తం చేశారు.