వీధి వ్యాపారులకిచ్చే కొవిడ్ రుణాల దరఖాస్తులను త్వరితగతిన ఆన్లైన్లో పూర్తి చేసి సంబంధిత బ్యాంకులకు అప్పగించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వీధి వ్యాపారుల రుణాల విషయమై జిల్లాలోని బ్యాంకు కోఆర్డినేటర్లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలలో సుమారు 1786 మంది వీధి వ్యాపారులను గుర్తించినట్లు తెలిపిన కలెక్టర్.. 293 దరఖాస్తులు ఆన్లైన్ అయ్యాయని పేర్కొన్నారు.
హరితహారంపై సమీక్షించిన కలెక్టర్... మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో నిర్దేశించిన లక్ష్యాలను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సకాలంలో మంచి వర్షాలు కురుస్తున్నందున హరితహారం లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీవాస్తవ, ఎల్డీఎం సురేశ్ కుమార్, ఎస్బీఐ కో ఆర్డినేటర్ సుధాకర్, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు హాజరయ్యారు.