నాకు తరచూ కడుపునొప్పి వచ్చేది. ఆసుపత్రికి వెళితే గర్భసంచిపై చిన్నచిన్న బొబ్బలు వచ్చాయన్నారు. మూడేళ్ల కిందట గర్భసంచి తొలగించారు. బరువు పనులు చేయడం ఇబ్బందిగా ఉంది. - 27 ఏళ్ల మహిళ
నడుం నొప్పితో వెళితే..
నా వయసు 38 ఏళ్లు. తరచూ నడుంనొప్పితో తెల్లబట్ట అధికంగా వచ్చేది. స్థానికంగా ఓ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లా. కొన్నిరోజులు మాత్రలు ఇచ్చినా తగ్గలేదు. గర్భసంచి తీసివేయాలన్నారు. మహబూబ్‌నగర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లి గర్భసంచి తొలగించారు. వారంరోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నాం. రూ.30 వేల వరకు ఖర్చు అయింది. ఇపుడు నడుంనొప్పి ఎక్కువై పనులు సక్రమంగా చేసుకోలేకపోతున్నా. - ఓ మహిళ, ఎన్కి తండా, ఖిల్లాగణపురం
గతంలో బాగా పనులు చేసేదాన్ని..
నా వయసు 30. ఆర్‌ఎంపీ వద్దకు వెళితే పుండు వచ్చిందని గర్భసంచి తీసివేశారు. ఫీజు రూ.20 వేలు తీసుకున్నారు. ఆస్పత్రిలో మరో రూ.5 వేలు ఖర్చు అయ్యింది. ఆపరేషన్ చేసినప్పటి నుంచి కడుపులో నొప్పిగా ఉంది. గతంలో పనులు బాగా చేసేదాన్ని. ఇపుడు చేసుకోలేకపోతున్నా. - ఓ మహిళ, ఎన్కి తండా, ఖిల్లాగణపురం
70 నుంచి 80 మందికి గర్భసంచి తొలగింపు..
వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలంలోని ఎన్కి తండా జనాభా 932. అందులో మహిళలు 460. వీరిలో 70 నుంచి 80 మందికి గర్భసంచిని తొలగించారు. ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో ఈ విషయం బయటకు వచ్చింది. ఎన్కితండా చుట్టుపక్కల గ్రామాల్లోనూ గర్భసంచిని తొలగించుకున్నవారు పదుల సంఖ్యలో ఉన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని ఐనోలు గ్రామ జనాభా 1,616. ఇందులో మహిళలు 816. ఈ గ్రామంలో 53 మంది మహిళలు తమ గర్భసంచులను తొలగించుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇలా 318 తండా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి కింద మరో మూడు వేల వరకు అనుబంధ తండాలున్నాయి. చాలా తండాల్లో ఇదే దుస్థితి.
కాసుల కక్కుర్తితో మహిళల జీవితాలతో ఆడుకుంటున్న ఆర్ఎంపీలపై అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు కోరుతున్నారు.
ఇవీ చూడండి: