దేశంలో తొలిసారి.. డ్రోన్ల ద్వారా ఔషధాలు సరఫరా చేసే బృహత్ కార్యక్రమం తెలంగాణలో అమలవుతోంది. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టు(Medicine from the sky) ప్రయోగాత్మకంగా వికారాబాద్ జిల్లాలో మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా వికారాబాద్‌లో డ్రోన్లతో ఔషధాలు సరఫరా చేశారు. ఇందులో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాలకు ఔషధాలు రవాణా చేయడం కోసమే ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో ఔషధాలు, టీకాలను వేగంగా చేరవేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సుమారు 40 కిలోమీటర్ల వరకు డ్రోన్ ప్రయాణిస్తుంది. ఒక్క డ్రోన్లో 15 రకాల ఔషధాలు, టీకాల సరఫరాకు అవకాశం ఉంటుంది. నాణ్యత దెబ్బతినకుండా డ్రోన్లో 4 వేర్వేరు బాక్సుల్లో మందులు సరఫరా చేస్తారు. భూమికి 500-700 మీటర్ల ఎత్తులో ఇది ప్రయాణించనుంది.
రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ఆధ్వర్యంలో.. మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టు(Medicine from the sky)కు ప్రభుత్వం అంకురార్పణ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ ఆర్థిక వేదిక, నీతి ఆయోగ్, హెల్త్నెట్ గ్లోబల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో.. ఐటీశాఖ జట్టు కట్టింది. ఈ సంస్థల భాగస్వామ్యంతో డ్రోన్ ఫ్లైట్ల(DRONE FLIGHTS) ద్వారా అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు ఔషధాలు సరఫరా చేయటం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.