Jagadish reddy on power reforms: రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తుంటే దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మోదీ నాయకత్వం వహించిన గుజరాత్లో కనీసం ఆరు గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కేంద్రం ఉందన్నారు. ఉచిత విద్యుత్ లక్ష్యాన్ని దెబ్బతీసేలా కేంద్రం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామంలో రూ.34 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాన్ని అడ్డుకోలేరని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయరంగానికి ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇవ్వడం లేదన్నారు. ప్రధాని రాష్ట్రమైన గుజరాత్లో విద్యుత్ అందించలేక పవర్ హాలిడే ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం ఎన్ని ఆటంకాలు సృష్టించిన నిరంతర ఉచిత విద్యుత్త్ అందిస్తామని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణను దెబ్బకొట్టాలని చూస్తోంది. ఇవాళ గుజరాత్లో రోజుకు 6 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. కేసీఆర్ 24 గంటలు ఇస్తే మీరెందుకు ఇవ్వరని గుజరాత్లో ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో రాష్ట్రంలో మీటర్లు పెట్టాలని యత్నించారు. పెట్టకపోతే రాష్ట్రానికి లోన్లు ఇవ్వమని బెదిరించారు. తెలంగాణలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందిస్తుంటే అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. మనకు విద్యుత్ అమ్మే సంస్థలను భయపెడుతున్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ రైతులకు అండగా ఉంటారు. - జగదీశ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నిరంతర విద్యుత్ అందిస్తుంటే కేంద్రం ఓర్వలేక కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా కేంద్రమంత్రే రంగంలోకి దిగి తెలంగాణకు విద్యుత్ ఇవ్వొద్దంటూ కంపెనీలతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఋణాలు రాకుండా కేంద్రం అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. వ్యవసాయానికి మీటర్లు పెట్టమని కేంద్రం ఒత్తిడి చేస్తోందన్నారు.
ఇవీ చూడండి: Ganja seize: గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ అసిస్టెంట్ డైరెక్టర్
Honor Killing Case: 'రామకృష్ణను హత్య చేసేందుకు ఆర్నెళ్ల క్రితమే సుపారీ ఇచ్చాడు'